Begin typing your search above and press return to search.

గ్రేటర్ సమరం .. తొలి రెండు గంటల్లో ఎంతంటే..

By:  Tupaki Desk   |   1 Dec 2020 7:45 AM GMT
గ్రేటర్ సమరం .. తొలి రెండు గంటల్లో ఎంతంటే..
X
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ కొంచెం మందకొడిగా ముందుకు సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైనప్పటికీ, చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య పలుచగా కనిపిస్తుంది. ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మరోవైపు పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఓటు వేశారు. వీరితోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హైదరాబాద్ సైబారాబాద్ కమీషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్‌లు ఓటు వేశారు. గ్రేటర్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 74 లక్షల 67వేల 256 మంది. ఇక పోలింగ్ కోసం జంటనగరాల పరిధిలో 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈసారి గ్రేటర్ బరిలో 150 డివిజన్లకు గాను 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్‌ ఎస్‌-150, బీజేపీ-149, కాంగ్రెస్‌-146 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక టీడీపీ-106, ఎంఐఎం-51 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. సీపీఐ-17, సీపీఎం-12, ఇతర పార్టీలు-76, స్వతంత్రులు-415 మంది పోటీలో ఉన్నారు.

ఇకపోతే , జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలోనూ 50 శాతం కూడా నమోదు కాలేదు. 2009లో 42.04 శాతంగా నమోదైన ఓటింగ్.. 2016లో 45.29 శాతంగా నమోదైంది. ఈసారి ఓటింగ్ శాతం 50 శాతానికి చేరుకునేలా చేయాలని చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అయితే పోలింగ్ ట్రెండ్ ను బట్టి చూస్తే గతం కంటే ఎక్కువ పోలింగ్ జరగడం కష్టమే. అయితే ఎక్కువమంది 11 తర్వాత పోలింగ్ రావడం జరుగుతుంటుంది. చూడాలి పోలింగ్ ముగిసే సమయానికి ఎంత శాతం పోలింగ్ జరుగుతుందో .