Begin typing your search above and press return to search.

లోగుట్టు సమీక్షల్లోనూ సెంచరీ మాటనే చెబుతున్న కేటీఆర్

By:  Tupaki Desk   |   9 Oct 2020 12:00 PM IST
లోగుట్టు సమీక్షల్లోనూ సెంచరీ మాటనే చెబుతున్న కేటీఆర్
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాంచి కాన్ఫిడెన్స్ లో ఉన్నట్లు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగే ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారు. గతంలో 99 స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేసి.. సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ మాటకు వస్తే.. గ్రేటర్ ఎన్నికల్లో సాధించిన విజయమే.. టీఆర్ఎస్ లో కేటీఆర్ రేంజ్ ను అమాంతం పెంచేసినట్లుగా చెబుతున్నారు. అప్పటివరకు నెంబరు టూ మీద ఉన్న ఊగిసలాట ఒక కొలిక్కి వచ్చినట్లుగా పలువురు విశ్లేషిస్తారు.

గడిచిన నాలుగున్నరేళ్లలో హైదరాబాద్ మహానగరం మీద పట్టు పెంచుకున్న కేటీఆర్ కు తాజా ఎన్నికలు నల్లేరు మీద నడకనే అని చెబుతున్నారు. అదే సమయంలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే.. ఊహించని షాకులు తగిలే ప్రమాదం ఉందన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు ఏ స్థాయిలో ఉందన్న విషయంపై ఇప్పటికే ఐదారు సర్వేల్ని ఇటీవల నిర్వహించారు.

అన్నింటిలోనూ టీఆర్ఎస్ అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపించినట్లు చెబుతున్నారు. ఈసారి సెంచరీ కోరికను కూడా తీర్చేసుకుంటారని.. ఆ మాటకు వస్తే.. వందకు పైగా స్థానాల్లో విజయం ఖాయమని మంత్రి కేటీఆర్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన గ్రేటర్ పరిధిలో భారీ ఎత్తున రివ్యూ మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు తాజాగా సిటీలోని 150 డివిజన్ల పరిస్థితులపై సమీక్ష జరిపినట్లుగా వార్తలు వచ్చినప్పటికి.. మజ్లిస్ అధిపత్యంలో ఉండే 40కి పైగా స్థానాల గురించి అస్సలు పట్టించుకోవటం లేదన్న మాట వినిపిస్తోంది.

తాజాగా జరిపిన రివ్యూలోనూ గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి వంద సీట్లు ఖాయమన్న మాట మంత్రి కేటీఆర్ నోటి నుంచి పదే పదే వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ చూసిన టీఆర్ఎస్ నేతలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో నగరంలో బీజేపీ జోరు పెరిగిందని.. దీనికి తోడు టీఆర్ఎస్ కార్పొరేటర్లలో కొద్ది మంది మీద తీవ్రమైన విమర్శలు.. ఆరోపణలు రావటం.. ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్ల మధ్య నెలకొన్న పంచాయితీలు కేటీఆర్ చెబుతున్న వంద కలకు అడ్డంకిగా మారినట్లు చెబుతున్నారు.

ఆ ప్రతికూలతల్ని పట్టించుకోకుండా.. వందకు తగ్గని కేటీఆర్ మాటలు గులాబీ నేతల మద్య హాట్ టాపిక్ గా మారాయి. అదే పనిగా వందకు పైనే అన్న మాట చెబితే.. రేపొద్దు వందకు సీట్లు కాస్త తగ్గినా.. ఓటమి ముద్ర వేస్తారన్న విషయాన్ని మర్చిపోకూడదన్న మాటలు కూడా నిజమేనన్న భావన కలుగక మానదు.