Begin typing your search above and press return to search.

కొత్త సంవత్సరంలో గ్రేటర్ ఎన్నికలు

By:  Tupaki Desk   |   18 Sept 2020 5:00 PM IST
కొత్త సంవత్సరంలో గ్రేటర్ ఎన్నికలు
X
గడిచిన కొద్ది రోజులుగా గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పలు అంచనాలు..ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే వీలుందన్న అంశంపై ఎవరికి వారు మాట్లాడుకోవటమే కాదు.. ఎన్నికల సంఘం నుంచి కానీ.. ఎన్నికల కమిషనర్ కానీ పెదవి విప్పింది లేదు. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలకాంశాల్ని ప్రస్తావించారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న అంశం మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి.

తాజాగా ఆయన చెప్పిన మాటల్ని చూస్తే.. గడువు కంటే ముందే గ్రేటర్ ఎన్నికల్ని పూర్తి చేసే అవకాశమే ఎక్కువ అవుతుంది. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ.. అందుకు తగ్గట్లుగానే పోలింగ్ ప్రక్రియ చేపట్టేందుకు వీలుగా కసరత్తు సాగుతోంది. గతంలో గ్రేటర్ ఎన్నికలు 2016 ఫిబ్రవరి 11న జరిగాయి. అంటే.. 2021 ఫిబ్రవరి 10 నాటికి తాజా సభ కాల పరిమితి ముగుస్తుంది. ఆలోపు ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది.

దీనికి తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పని చేస్తోందని పార్థసారధి వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన కసరత్తు మొదలైందని.. ఓటర్ల జాబితా ప్రచురించటం.. పోలింగ్ స్టేషన్ల జాబితా తయారు చేయటం.. ఎన్నికల సిబ్బందిని సమకూర్చుకొని వారికి శిక్షణ ఇవ్వటం.. ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేయటం లాంటి పనుల్ని ఇప్పటికే ప్రారంభించినట్లుగా పార్థసారధి చెప్పారు.

ఆయన మాటల్ని బట్టి చూస్తే.. ఈ ఏడాది చివరి నాటికి (డిసెంబరులో) ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే.. పదిహేను రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే వీలుంది. అంటే.. కొత్త సంవత్సరం 2021 జనవరి మొదటి వారం చివరి నాటికి ఎన్నికలు పూర్తి అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే.. జనవరి రెండు.. మూడు వారాల్లో సంక్రాంతి పండుగ ఉంటుంది.. ఆ సందట్లో ఎన్నికలు నిర్వహించే వీలు తక్కువగా ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. కొత్త సంవత్సరం తొలి నాళ్లలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.