Begin typing your search above and press return to search.

గ్రేటర్ లో తొలి ఫలితం మెహదీపట్నం డివిజన్ ఎందుకు?

By:  Tupaki Desk   |   4 Dec 2020 9:32 AM IST
గ్రేటర్ లో తొలి ఫలితం మెహదీపట్నం డివిజన్ ఎందుకు?
X
గ్రేటర్ సస్పెన్స్ వీడిపోనుంది. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తం 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్ని ఈసారి బ్యాలెట్ పద్దతిని నిర్వహించారు. దీంతో.. ఈవీఎంలతో వచ్చే ఫలితాలతో పోలిస్తే.. కాస్త ఆలస్యంగా ఫలితాలు రానున్నాయి. బ్యాలెట్ పద్దతిలో.. ఓట్లను పాతిక చొప్పున కట్టలు కట్టటం.. వెయ్యి చొప్పున టేబుల్ మీద ఏర్పాటు చేయటం.. ఒక్కో రౌండ్ కు 14వేల ఓట్లను లెక్కించే పద్దతి గురించి తెలిసిందే.

తొలుత పోస్టల్ ఓట్లను లెక్కవేసి.. అనంతరం బ్యాలెట్ బాక్సుల్ని ఓపెన్ చేస్తారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను షురూ చేసినా.. ఓట్ల లెక్కింపు మొదలు కావటానికి మాత్రం ఉదయం 10.30 గంటల వరకు పడుతుంది. కొన్నిచోట్ల మరో అరగంట నుంచి గంట ఆలస్యమయ్యే వీలుంది. ఇక.. మొదటి రౌండ్ లెక్క వేయటానికి మరో గంట సమయం పట్టే వీలుంది.

అంటే.. తొలి ఫలితం ఉదయం 11గంటల నుంచి 12 గంటల మధ్యలో వెలవడే వీలుంది. ఇక.. పోలింగ్ లో అతి తక్కువ ఓట్లు పోలైన మెహదీపట్నం డివిజన్ ఫలితం తొలుత వెల్లడి కానుంది. అక్కడ కేవలం 11,818 ఓట్లు మాత్రమే పోల్ కావటంతో.. తొలి రౌండ్ లోనే ఫలితం తేలనుంది. గ్రేటర్ లో మొత్తం 1122 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో 150 మంది విజేతల లెక్క ఈ రోజు సాయంత్రానికి తేలిపోనుంది.

దాదాపు 18 ఏళ్ల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్ని బ్యాలెట్ పద్దతిలో నిర్వహించారు. దీంతో.. ఈ ప్రక్రియకు అలవాటు తప్పిపోవటంతో..కాస్త ఆలస్యంగా ఫలితాలు వెలువడే వీలుంది. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 11-12 మధ్యలో వెలవడితే.. రెండో రౌండ్ ఫలితం మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో వెలువడే వీలుంది. సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటలకు పూర్తిగా ఫలితాలు వెలువడే వీలుందని చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 30 కేంద్రాల్ని గ్రేటర్ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు.