Begin typing your search above and press return to search.

ఇక తాగండి.. ఊగండి.. మరో గంట..

By:  Tupaki Desk   |   3 Aug 2018 9:52 AM IST
ఇక తాగండి.. ఊగండి.. మరో గంట..
X
హైదరాబాద్.. మహానగరంలో జనాభా దాదాపు కోటికి పైగా ఉంది. దేశంలోనే ఐదో పెద్ద నగరమైన భాగ్యనగరిలో భిన్న సంస్కృతుల వారు.. భిన్న మతాల వారు కలిసి మెలిసి ఉంటున్నారు. ఇంత పెద్ద సిటీలో చూడదగ్గ ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఎంతో విశిష్టత కలిగిన హైదరాబాద్ నగరంలో వీకెండ్ లు వస్తే చాలు అందరూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కుటుంబాలు పార్కులు - సర్కస్ లు - వివిధ కార్యక్రమాలకు వెళితే యూత్ - ఉద్యోగులు మాత్రం బార్లు - వైన్ షాపులు - పబ్ లలో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా మందుబాబులకు మరింత కిక్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది.

హైదరాబాద్ జీహెచ్ ఎంసీ విస్తరించిన 5 కి.మీల పరిధిలో ఉన్న బార్లలో శుక్ర - శనివారాల్లో రాత్రి ఒంటిగంట వరకూ మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకే అనుమతి ఉంది. దీన్ని తాజాగా మరో గంట పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జీహెచ్ ఎంసీ పరిధిలో 400 బార్లు - పబ్బులు ఉన్నాయి. నిత్యం లక్ష లీటర్ల మద్యం - 5లక్షల లీటర్ల బీర్ల విక్రయం జరుగుతోంది. తాజా నిర్ణయం వల్ల ఎక్సైజ్ శాఖకు అదనపు ఆదాయం లభించనుంది. హోటళ్లు - బార్ల యాజమాన్యాల కోరిక మేరకు మెట్రో నగరాల్లో ఉన్న టైంను పరిశీలించి గంట సమయాన్ని పెంచామని ఎక్సైజ్ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు.