Begin typing your search above and press return to search.

వైసీపీ సీటు..మహేష్ ఫ్యామిలీ మెంబర్ కు చాన్స్?

By:  Tupaki Desk   |   22 Aug 2018 1:34 PM GMT
వైసీపీ సీటు..మహేష్ ఫ్యామిలీ మెంబర్ కు చాన్స్?
X
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి మరో వ్యక్తి వస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ చాలా ఏళ్ల కింద పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఓసారి ఎంపీగా పోటీచేసి గెలిచి ప్రజా సేవ చేశారు. ఇప్పుడు పూర్తిగా అన్నీ వదిలేసి రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. అసలు రాజకీయాలంటేనే పడవంటున్నారు. ఇక మహేష్ బావ గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా గెలిచి ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఘట్టమననేని ఫ్యామిలీ నుంచి 2019 ఎన్నికల బరిలో మరో వ్యక్తి వస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2019లో టఫ్ ఫైట్ తో సాగనున్నాయి. ఓ వైపు అధికార టీడీపీ - ప్రతిపక్ష వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ అనివార్యంగా మారింది. ఇదే సమయంలో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరొకరు ఏపీ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు సీటు కూడా కన్ఫం అయినట్టు వార్తలొస్తున్నాయి.

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ టీడీపీ - వైసీపీ నువ్వానేనా అన్నట్టు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే వైసీపీలో తెనాలి సీటు ఎవరికి ఇస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెనాలిలోని కొల్లిపోర మండలంలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువ. తెనాలి రూరల్ లో కమ్మ సామాజికవర్గం ఎక్కువ. అదే సమయంలో నియోజకవర్గం మొత్తం కాపు సామాజికవర్గం కూడా బలంగానే ఉంది. దీంతో ప్రతి పార్టీ కూడా ఈ మూడు సామాజికవర్గం గల నేతలనే బరిలోకి దింపుతూ ఉంటుంది. ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా శివకుమార్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. శివకుమార్ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. స్థానికుడు కావడంతో మరోసారి ప్రజలు - కార్యకర్తలకు చేరువగా ఉంటూ టిక్కెట్ నాదే అంటూ బాగా కృషి చేస్తున్నారు.

అయితే వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి చక్రం తిప్పి చివరి క్షణంలో తన అల్లుడు కిలారీ రోశయ్యకు టికెట్ ఇప్పిస్తాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉమ్మారెడ్డి కాపు సామాజికవర్గం కావడంతో కీలకంగా మారారు. దీంతో వీరిద్దరిమధ్య టికెట్ పై పోటీ నెలకొంది.

వీరిద్దరూ సీటు కోసం కొట్టుకుంటున్న వేళ.. సీన్లోకి సడన్ గా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఎంట్రీ ఇచ్చాడు. ఆదిశేషగిరి రావు వైసీపీలో ఎప్పుడో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటచేస్తాడనే దానిపై రకరకాల ప్రచారాలున్నాయి. అయితే ఇప్పుడు ఆది తెనాలి నుంచి పోటీచేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట.. వైసీపీ టికెట్ ఇస్తే తాను తెనాలి నుంచి పోటీచేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

ఇక తెనాలి ఎంపీ బాలశౌరి కూడా ఈసారి తెనాలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట..ఇక మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ చివరి నిమిషంలో వైసీపీలో చేరి టికెట్ చేజిక్కించుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా ఐదుగురి నేతల చుట్టూ తెనాలి టిక్కెట్ తిరుగుతోంది. వైసీపీ అధిష్టానం ఎవరికి ఇస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. వీరిలో ఎవరు టిక్కెట్ చేజిక్కించుకుంటారనేది పార్టీ నేతలకు కూడా అంతుబట్టని విషయంగా మారింది.