Begin typing your search above and press return to search.

మా చానల్ ను ఆదుకోండి.. లోకేశ్ కు ఓ న్యూస్ చానల్ విజ్ఞప్తి

By:  Tupaki Desk   |   21 March 2020 10:30 AM GMT
మా చానల్ ను ఆదుకోండి.. లోకేశ్ కు ఓ న్యూస్ చానల్ విజ్ఞప్తి
X
తెలుగులో న్యూస్ చానల్స్ దాదాపు వందకు పైగానే ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా ఉన్నాయి మాత్రం దాదాపు 15 మాత్రమే. ఆ 15లో లాభాల్లో ఉన్న సంస్థలు ఐదు కూడా ఉండవు. ప్రజలను ప్రభావితం చేసేలా ఉన్న చానల్స్ కూడా కొన్నే ఉన్నాయి. ఆ చానల్స్ కు ఎన్నికలప్పుడే గిరాకీ ఎక్కువ. అయితే రాజకీయ పార్టీలతో లోపాయకారి ఒప్పందం చేసుకుని నడిపిస్తున్న సంస్థలు కొద్దోగొప్పో నడుస్తున్నాయి. ఆ సంస్థలకే కొంత భవిష్యత్ పై ఆశలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు వాటిని పట్టించుకోకుంటే ఆ చానల్స్ మనుగడ కష్టమే. అయితే రాజకీయ పార్టీలకు మీడియాకు అవినాభావ సంబంధం ఉంటుంది. రాజకీయాలకు మీడియా కావాలి.. మీడియాకు రాజకీయాలతో పాటు ఆర్థిక సహకారం కావాలి. దీంతో ఆ రెండు చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగితేనే రాజకీయ పార్టీలకు, చానల్స్ కు మహర్దశ ఉంటుంది. ప్రస్తుతం ఆ విధంగానే తెలుగు న్యూస్ చానల్స్ కొనసాగుతున్నాయి. అయితే కొన్ని చానల్స్ తీవ్ర కష్టాలు పడుతూ కొనసాగుతున్నాయి. మూసివేసే స్థాయికి చేరుకున్నాయి.

ఈ పరిస్థితిలో కార్పొరేట్ వర్గాలకు అమ్ముకోవడమో లేదా ఏదైనా రాజకీయ పార్టీతో ఒప్పందం చేసుకోవడమో చేయాలి. ఆ విధంగా ఒక న్యూస్ చానల్ తెలుగుదేశం పార్టీని సంప్రదించిందంట. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కొన్ని మీడియా సంస్థలను పోషిస్తోంది. ఆ క్రమంలో తమ చానల్ ను కూడా ఆదుకోవాలని ఆ సంస్థ సంప్రదించిందని సమాచారం. మాజీ మంత్రి నారా లోకేశ్ ను కలిసి ఈ విషయం తెలిపారంట. ఎన్నికలకు ముందు మీ పార్టీకి ఎంతో సహకరించామని.. ప్రస్తుతం తమ పరిస్థితి దారుణంగా ఉంది మీరే ఆదుకుని సంస్థను కాపాడాలని విజ్ఞప్తి చేశారంట. మీ సహకారం ఉంటే తమ సంస్థకు ఎంతో ప్రయోజనం ఉంటుందని భావించి ఈ మేరకు ఆ చానల్ ప్రతినిధులు లోకేశ్ కలిసి విన్నవించారని సమాచారం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ ఇలా ఒక పార్టీని అడుక్కునే స్థాయికి చేరిపోయింది.

టీవీల కాలం పోయి ప్రస్తుతం యూట్యూబ్ కాలం నడుస్తోంది. దీంతో పాటు న్యూచానల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో డిజిటల్ వార్త ప్రపంచం విస్తరిస్తోంది. దీంతో న్యూస్ చానల్స్ పరిస్థితి దినదినగండంగా మారుతున్నాయి. సంచలన ఘటనలు, ప్రముఖ పరిణామాలు ఉన్న సమయంలో మాత్రమే ప్రజలు న్యూస్ చానల్స్ చూస్తున్నారు. మినహా సాధారణ సమయంలో వినోద కార్యక్రమాల చానల్స్ చూస్తున్నారు. వారిని తమ చానల్ వైపు మళ్లించుకునేందుకు అపసోపాలు పడుతున్నారు. దీంతో న్యూస్ చానల్స్ తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఆ క్రమంలోనే తీవ్ర నష్టాల బారిన పడి ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితికి చేరుకుంటున్నాయి. ఆ క్రమంలోనే ఈ న్యూస్ చానల్ చేరింది. తమను కాపాడాలని లోకేశ్ బాబును కలిసి విజ్ఞప్తి చేశారంట.

న్యూస్ చానల్ అంటే ఒక ఆఫీస్ తెరిచేసి.. స్టూడియో కట్టేసి.. పరికరాలు తీసుకుని.. ఓ వంద మందిని నియమించుకుని.. మైక్ పట్టుకుని ప్రజల్లోకి వెళ్లడం కాదు. న్యూస్ చానల్ కు అనుభవజ్ఞులైన పాత్రికేయులు, మీడియా రంగం పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు.. ఒక పద్ధతి.. పాడు ఉండక్కర్లే. ఈ విధంగా న్యూస్ చానల్స్ ను తెరిచేసి చివరకు నష్టాలు భరించలేక మూసివేసే స్థాయికి చేరి చివరకు అమాయకులైన ఉద్యోగులను రోడ్డుపాలు చేస్తున్న ఘటనలు ఎన్నో చూశాం. ప్రస్తుతం ఆ సంస్థను టీడీపీ లేదా ఇతర సంస్థనో.. పార్టీనో కాపాడుకుంటే ఈ చానల్ కూడా మూసివేసుకోవాల్సిందే.