Begin typing your search above and press return to search.

నేటి త‌రానికి తెలీని నిన్న‌టి త‌రం నేత వెళ్లిపోయారు

By:  Tupaki Desk   |   29 Jan 2019 6:14 AM GMT
నేటి త‌రానికి తెలీని నిన్న‌టి త‌రం నేత వెళ్లిపోయారు
X
అత్యుత్త‌మ స్థానాల్లో ఉన్న వారెంత ఆడంబ‌రంగా ఉంటారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. కొంద‌రు నేత‌లు నిరాడంబ‌రంగా ఉన్న‌ప్ప‌టికీ.. పీక‌ల్లోతు స్కాంల్లో చిక్కుకుంటూ ఉంటారు. కానీ.. నీతిగా.. నిజాయితీగా..నిత్యం దేశం గురించి ఆలోచిస్తూ మ‌చ్చ‌లేని రాజ‌కీయాలు చేసే ఫైర్ బ్రాండ్ రాజ‌కీయ నేత‌ను ఊహించ‌గ‌ల‌రా?

మీరు చెబుతున్న గుణాలు సినిమాల్లోనూ.. కాల్పానిక క‌థ‌ల్లోనూ ఉంటాయే త‌ప్పించి వాస్త‌వ‌రూపంలో ఎందుకు ఉంటాయ‌న్న ప్ర‌శ్న‌ను మీరు వేయొచ్చు. కానీ.. నిన్న‌టి త‌రం నాయ‌కుడు.. గ‌డిచిన కొద్దికాలంగా అనారోగ్యంతో బ‌య‌ట ప్ర‌పంచానికి సంబంధం లేకుండా త‌న‌దైన ప్ర‌పంచంలో బ‌తుకుతున్న భారత ర‌క్ష‌ణ శాఖ మాజీమంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) ఈ రోజు తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. వాజ్ పేయ్ హ‌యాంలో ర‌క్ష‌ణ మంత్రిగా విశిష్ఠ సేవ‌లు అందించిన జార్జి ఫెర్నాండెజ్ 1930 జూన్ 3న క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరులో జ‌న్మించారు.

కార్మిక సంఘాల్లో కీల‌కంగా ప‌ని చేసిన జార్జి ఫెర్నాండెజ్ ప్ర‌జాపోరాట యోధుడిగా పేరు సంపాదించారు. నూలు చొక్కా వేసుకొని.. నిరాడంబ‌ర‌త‌కు నిలువెత్తు రూపంగా ఉండే ఆయ‌న 1967లో ద‌క్షిణ ముంబ‌యి నుంచి తొలిసారి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌.. స‌మాచార మంత్రిత్వ శాఖ‌లోనూ ప‌ని చేశారు. జ‌న‌తాద‌ళ్ పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న త‌ర్వాతి కాలంలో స‌మ‌తా పార్టీని స్టాఫించారు.

2009 ఆగ‌స్టు నుంచి 2010 జులై వ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఉన్న ఆయ‌న త‌ర్వాతి కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురై రాజ‌కీయాల‌కు.. ప్ర‌జా జీవితానికి పూర్తిగా దూర‌మైపోయారు. విలువ‌ల‌తో వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న తీరు నేటి త‌రానికి పెద్దగా ప‌రిచ‌యం లేద‌నే చెప్పాలి. నిన్న‌టి త‌రానికి చెందిన అత్యుత్త‌మ నేత‌ల గురించి నేటి త‌రం తెలుసుకోవాలంటే ఆ జాబితాలో జార్జి ఫెర్నాండెజ్ పేరు త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది.