Begin typing your search above and press return to search.

ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది..

By:  Tupaki Desk   |   14 Feb 2019 11:20 AM IST
ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది..
X
కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. గత సార్వత్రిక ఎన్నికలను మే మొదటి వారం వరకూ నిర్వహించిన ఈసీ ఈసారి మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టి.. ఏప్రిల్ నెలాఖరుతో క్లోజ్ చేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అంటే గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 15 రోజుల ముందే ప్రక్రియ మొదలుపెట్టి.. 15 రోజుల ముందుగానే ఎన్నికలను దేశంలో ముగించబోతున్నారట..

ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రపంచ సంస్థలు ఈ ఏడాది ఎండలు దంచికొడుతాయని.. ఇండియాలో 50డిగ్రీలకు మించి ఎండలు కాస్తాయని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను ఏప్రిల్ చివరి వారానికే పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించినట్టు సమాచారం.

మరో రెండు వారాల్లో ఎన్నికల తేదీలతో కూడిన షెడ్యూల్ ను విడుదల చేసేందుకు ఈసీ రెడీ అయ్యింది. ఫిబ్రవరి నెల ఆఖరి రోజును అందుకు మూహూర్తంగా పెట్టుకున్నట్టు సమాచారం. మార్చి నెల ఆరంభంలో మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతోందని సమాచారం. మార్చి నెలాఖరుకు తుది విడత పోలింగ్ కూడా జరగబోతోందని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా దాదాపు 5 దశల్లో ఎన్నికలను పూర్తి చేయడానికి ఈసీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నెలాఖరుకు మొత్తం పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ నెలాఖరుకే మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. తొలి విడతలో ఏపీ ఉంటే పరిస్థితులు మరింత హీటెక్కుతాయి. అందుకే బాబు, జగన్ ఇప్పుడు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. చంద్రబాబు వరాల వాన కురిపించేందుకు రెడీ అవుతున్నారు.