Begin typing your search above and press return to search.

గీత పెళ్లి బాధ్య‌త ఈ ముఖ్య‌మంత్రిదేన‌ట‌

By:  Tupaki Desk   |   9 July 2017 9:24 AM GMT
గీత పెళ్లి బాధ్య‌త ఈ ముఖ్య‌మంత్రిదేన‌ట‌
X
గీత గుర్తుందా? దాదాపు రెండేళ్ల క్రితం (కొన్ని నెల‌లు త‌క్కువ‌గా) పాక్ నుంచి భార‌త్‌ కు మ‌న‌మ్మాయి తిరిగి వ‌చ్చేసిన వైనం దేశ వ్యాప్తంగా అంద‌రూ మాట్లాడుకునేలా చేసింది. అప్పుడెప్పుడో చిన్న‌ప్పుడు పాక్ కు త‌ప్పిపోయి వెళ్లిపోయిన మూగ‌.. చెవిటి చిన్నారి.. త‌న మూలాల్ని మ‌ర్చిపోలేని నేప‌థ్యంలో.. ఆమెను భార‌త్‌ కు సాద‌రంగా తీసుకొచ్చింది భార‌త స‌ర్కారు.

ఇప్పుడు ఆమె మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఉంటున్నారు. ఇండోర్ లోని ఇండోర్ అకాడ‌మీలో ఆమె ఉంటున్నారు. ప్ర‌స్తుతం హిందీ.. ఇంగ్లిష్ భాష‌ల్ని నేర్చుకుంటున్న ఆమె తాజాగా కేంద్ర‌మంత్రి సుష్మా స్వ‌రాజ్‌ ను క‌లుసుకున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని విదిశ నుంచి ఎంపీగా ఎంపికైన సుష్మా తాను భోపాల్ వెళ్లినప్పుడు త‌ర‌చూ గీత‌ను క‌లుస్తూ.. ఆమె యోగ‌క్షేమాల గురించి వాక‌బు చేస్తుంటారు.

తాజాగా ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్ ప‌లు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తూ.. త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ వెళ్లారు. ఈ కార్య‌క్ర‌మానికి సుష్మా గీత‌ను తీసుకెళ్లారు. అక్క‌డ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి కోవింద్‌.. ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమె యోగ‌క్షేమాల గురించి ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా సుష్మా క‌ల్పించుకొని గీత‌కు పెళ్లి చేయాల్సి ఉంద‌ని.. ఆమెకు క‌న్యాదానం చేసే బాధ్య‌త‌ను ముఖ్య‌మంత్రి చేప‌ట్టాల‌ని కోర‌టం.. అందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ఒప్పుకోవ‌టం జ‌రిగాయి. దీంతో.. గీత పెళ్లి బాధ్య‌త‌లు సీఎం చూస్తార‌ని సుష్మ వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే.. తాను తిరిగి పాక్‌ కు వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని.. తాను భార‌తీయురాలిన‌ని.. గాంధీజీ పుట్టిన గ‌డ్డ మీద పుట్టాన‌ని.. భార‌త్‌లోనే ఉంటాన‌ని ఆమె పేర్కొన్నారు. ఈ మ‌ధ్య‌న తాను గుడికి వెళ్లి.. నాలుగు గంట‌లు ఆల‌స్యంగా ఇంటికి వెళితే (ఇండోర్ లోని మోనికా పంజాబీ వ‌ర్మ అనే వ్య‌క్తి ఫ్యామిలీతో గీత ఉంటున్నారు) తాను కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయ‌ని..వాటిల్లో నిజం లేద‌ని ఆమె పేర్కొన్నారు. విలేక‌రుల‌తో మాట్లాడిన ఆమె త‌న సౌంజ్ఞల ద్వారా తాను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని గీత వెల్ల‌డించ‌టం గ‌మ‌నార్హం.