Begin typing your search above and press return to search.

గావస్కర్ గురి.. ఈసారి కేఎల్ రాహుల్ పై

By:  Tupaki Desk   |   8 Jan 2022 10:39 AM GMT
గావస్కర్ గురి.. ఈసారి కేఎల్ రాహుల్ పై
X
భారత దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్.. దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం నుంచి ఆటగాళ్ల తీరును విశ్లేషిస్తున్నారు. గతంలో కామెంట్రీ బాక్స్ లో కూర్చుని వ్యాఖ్యాతగా అభిప్రాయాలను సూటిగా వెల్లడించిన గావస్కర్ ప్రస్తుతం మాత్రం మైదానం బయటి నుంచే విశ్లేషణ చేస్తున్నాడు. టెస్టు క్రికెట్ లో పదివేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా, భీకర బౌలర్లను హెల్మెట్ లేకుండా ఎదుర్కొన్న ధీశాలిగా, సంప్రదాయ క్రికెట్ లో రారాజుగా పేరున్నగావస్కర్ అభిప్రాయాలకు చాలా విలువ ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఆటగాళ్ల ప్రదర్శనను అతడు వివరించే తీరు ఎంతో ఆసక్తిగా ఉండేది. పొరపాటున స్పిన్నర్లు నో బాల్ వేసినా, బ్యాట్స్ మన్ పదేపదే తప్పులు చేసినా గావస్కర్ ఏకిపారేసేవాడు. అందుకే అతడి విశ్లేషణ అందరినీ ఆకట్టుకునేది.

మొన్నసిరాజ్ .. నిన్న పంత్.. నేడు రాహుల్ ఆట, ఆటగాళ్ల కంటే దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఇతర విషయాల రీత్యా పలుసార్లు వార్త్లల్లో నిలిచింది. కోహ్లి టి0 కెప్టెన్సీ వదులుకోవడం, వన్డేల సారథ్యం నుంచి తప్పించడం ఎంత వివాదాస్పదం అయ్యాయో తెలిసిందే. ఇక అజింక్య రహనే వైస్ కెప్టెన్సీపై వేటు, రోహిత్ కు వన్డే పగ్గాలివ్వడం, టెస్టు వైస్ కెప్టెన్ గా నియమించడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే, అనూహ్యంగా రోహిత్ టెస్టు, వన్డేలకు దూరమవడంతో కథ మరో మలుపు తిరిగింది. అదంతా మర్చిపోయి తొలి టెస్టు బరిలో దిగిన టీమిండియా ఘన విజయంతో సిరీస్ ను ప్రారంభించింది. అంతేకాక, 30 ఏళ్ల దక్షిణాఫ్రికా టూర్ చరిత్రలో తొలిసారి టెస్టు సిరీస్ ను గెలుపుతో ప్రారంభించినట్లయింది. ఇదే ఊపులో రెండో టెస్టునూ గెలిచి చరిత్రలో తొలిసారి సిరీస్ ను గెలుచుకుంటుందనిపించింది. కానీ, కెప్టెన్ కోహ్లి వెన్నుగాయంతో దూరమవడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయాల్సి వచ్చింది.

విజయం చేజారింది రాహుల్ వల్లేనంటూ రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం చాటినా.. విజయం మాత్రం దక్కలేదు. రెండో ఇన్నింగ్స్ లో బాగా పుంజుకొన్న దక్షిణాఫ్రికా గెలుపును ఎగురేసుకుపోయింది. దీనికి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వైఫల్యమే కారణమంటాడు గావస్కర్. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ విషయంలో రాహుల్ సరైన వ్యూహం లేకుండా వ్యవహరించాడని.. దీంతో దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమైందని గావస్కర్ పేర్కొన్నాడు. హుక్ షాట్లే ఆడని ఎల్గర్ కు బౌండరీల దగ్గర ఫీల్డర్లను పెట్టడాన్ని బాగా తప్పుబట్టాడు. దీనిని అవకాశంగా తీసుకున్న ఎల్గర్ సింగిల్స్ తీస్తూ క్రీజులో పాతుకు పోయాడని విశ్లేషించాడు. వాస్తవానికి ఇది కచ్చితమైన విశ్లేషణే. కాగా, ఇదే సిరీస్ లో పేసర్ మొహమ్మద్ సిరాజ్ ప్రవర్తనను, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ షాట్ సెలక్షన్ నూ గావస్కర్ తప్పుబట్టాడు. సిరాజ్ వేసిన బంతి కాలుకు తగిలి దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ బవుమా విలవిల్లాడుతున్నప్పటికీ.. అదేమీ పట్టించుకోకుండా సిరాజ్ బంతిని వికెట్ల వైపు విసరడాన్ని గావస్కర్ తీవ్రంగా విమర్శించాడు. సిరాజ్ కు పద్ధతి నేర్పాలంటూ సూచించాడు. ఇక కీలక సమయంలో పంత్ ఏమాత్రం ఆలోచించకుండా షాట్లు కొట్టడాన్ని కూడా గావస్కర్ తప్పుబట్టాడు.