Begin typing your search above and press return to search.

అమ్మ సీటుకు ఆమెను దించనున్న బీజేపీ

By:  Tupaki Desk   |   15 March 2017 4:24 AM GMT
అమ్మ సీటుకు ఆమెను దించనున్న బీజేపీ
X
విజయం ఇచ్చే కిక్కే వేరు. గెలుపు ఇచ్చే ధీమా మరిన్ని నిర్ణయాల్ని తీసుకోవటమే కాదు.. బలహీనతల్ని అధిగమించేందుకు అవసరమైన బలాన్ని.. శక్తిని ఇస్తుంది. బీజేపీ పరిస్థితి ఇప్పుడు అదే తీరులో ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ పొలిటికల్ గ్రాఫ్ ఎంతగా మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవ దృష్టితో చూస్తే.. ఐదు రాష్ట్రాలకు రెండు రాష్ట్రాల్లోనే విజయం సాధించినప్పటికీ.. యూపీలో సాధించిన బ్రహ్మాండమైన గెలుపు కమలనాథులకు కొత్త ధీమాను తెచ్చి పెట్టిందని చెప్పక తప్పదు.

ఉత్తరాదితో పాటు.. ఈశాన్య భారతంలోనూ తమ సత్తాను చూపిన కమలనాథులు.. తమకెంతకూ కొరుకుడుపడని దక్షిణాదిపై దృష్టి సారించాలని చూస్తున్నారు.అనుకోని రీతిలో సాగుతున్న తమిళనాడు ఉప ఎన్నికలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపటమే కాదు.. ఆమె గెలుపు కోసం కొంగొత్తగా ప్రయత్నం చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అమ్మ ఎన్నికైన ఆర్కే నగర్ ను సొంతం చేసుకోవటానికి అన్నాడీఎంకేలోని రెండు వర్గాలతో పాటు విపక్ష డీఎంకే పావులు కదుపుతోంది. ఇది సరిపోనట్లుగా ఇప్పుడు బీజేపీ బరిలోకి దిగాలని భావిస్తోంది. ఇందుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దింపటం ద్వారా తన సత్తాను చాటాటటంతో పాటు.. దక్షిణాదిన పాగా వేయటానికి ఇదే సరైన సమయమని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అధికారిక అన్నాడీఎంకే నుంచి బరిలోకి దిగే ఇద్దరు అభ్యర్థులు ఎవరన్నది దాదాపుగా తేలిపోయింది.చిన్నమ్మ వర్గం నుంచి ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కాగా.. పన్నీర్ సెల్వం వర్గం నుంచి మధుసూదనన్ పేర్లు దాదాపుగా ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక.. చిన్నమ్మ మేనకోడలు దీప కూడా బరిలోకి దిగాలని తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. డీఎంకే అభ్యర్థిని ఖరారు చేసే పనిలో స్టాలిన్ బిజీగా ఉన్నారు.ఇలాంటి వేళ..బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ నటి గౌతమిని ఎంపిక చేయటం దాదాపు ఖాయమన్న మాటను చెబుతున్నారు. సినీ నటుడు కమల్ నుంచి విడిపోయిన తర్వాత రాజకీయాలకు దగ్గర అవుతున్న ఆమె.. అమ్మ మరణంపై తనకున్న అనుమానాల్ని బయటపెట్టటం తెలిసిందే. అమ్మ ప్రాతినిధ్యం వహించిన స్థానంలో గౌతమి కానీ బరిలోకి దిగితే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి బీజేపీ వర్గాలు. అయితే..అదికారికంగా మాత్రం ఎవరూ నోరు విప్పకపోవటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/