Begin typing your search above and press return to search.

అమ్మ మరణంపై గొంతు విప్పిన గౌతమి

By:  Tupaki Desk   |   4 Feb 2017 3:02 PM GMT
అమ్మ మరణంపై గొంతు విప్పిన గౌతమి
X
మహా అయితే ఒకట్రెండు రోజుల్లో చిన్నమ్మ తమిళనాడు సీఎం కుర్చీలో కూర్చోనుందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.అమ్మ మరణంపై అవసరమైతే సీబీఐ దర్యాప్తు చేసుకోవాలంటూ అపోలో ఛైర్మన్ చెబుతుంటే.. ప్రముఖ సినీ నటి గౌతమి కోట్లాది మంది మదిలో ఉన్న సందేహాలపై తాజాగా గళం విప్పారు.

అమ్మ మరణంపై కోట్లాది మందికి బోలెడన్ని సందేహాలు ఉన్నాయని.. వీటిపై తమకు నివృతి చేయాలంటూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. అయితే.. గౌతమి లేఖాస్త్రానికి మోడీ రియాక్ట్ అయ్యింది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి గౌతమి గళం విప్పారు. తమ సందేహాల్ని ప్రధాని ఎందుకు తీర్చరని సూటిగా ప్రశ్నించారు.

తాము అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానాలు ఇవ్వకుండా మౌనంగా ఉంటే సరిపోదని. .కోట్లాది మంది అనుమానాల్ని నివృతి చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పనిలో పనిగా ప్రధాని మోడీకి తమిళుల సమస్యలు పట్టవా? అని గౌతమి క్వశ్చన్ చేశారు. డిజిటలైజేషన్ చాంఫియన్ అని తన గురించి మోడీ స్వయంగా చెప్పుకుంటారని.. సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలకు చెబుతారన్న గౌతమి.. ‘‘మరి గతంలో నేనులేఖ రాశాను. దానికి మోడీ ఇంకా స్పందించలేదు. భారతదేశమంతా తనకు ఒకటేనని భావిస్తే.. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులోని సమస్యల్ని ఆయన ఎందుకు పట్టించుకోవటం లేదు?’’ అని ప్రశ్నించారు. అమ్మ మరణం మీదనే కాదు.. తమిళులంటే కూడా మోడీకి పట్టదా? అంటూ అడిగిన గౌతమి ప్రశ్నకైనా ఆయన బదులిస్తారా? అన్నది చూడాలి.

గౌతమి సంధించిన ప్రశ్న విన్న వెంటనే పవన్ కల్యాణ్ గుర్తుకు రాక మానరు. ఇప్పటికే ఉత్తరాది.. దక్షిణాది అంటూ మాట్లాడుతున్న పవన్ కు తగ్గట్లే.. ఇప్పుడు గౌతమి కూడా దక్షిణాది వారిని ప్రస్తావిస్తూ.. తమిళుల సమస్యలు పట్టవా? అంటూ మోడీని ప్రశ్నించిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చూస్తుంటే పవన్ మాటలు స్ఫూర్తినిస్తున్నట్లు అనిపించట్లేదు..?