Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వేలంలో అతడికి షాక్

By:  Tupaki Desk   |   27 Jan 2018 8:05 AM GMT
ఐపీఎల్ వేలంలో అతడికి షాక్
X
ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఆరంభానికి ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉంది. ఈ లోపే ఆటగాళ్ల వేలంతో ఐపీఎల్ సందడి మొదలైపోయింది. బెంగళూరు వేదికగా శనివారం ఆరంభమైన వేలం.. ఆదివారం కూడా కొనసాగనుంది. తొలి రోజు వేలంలో అది పెద్ద షాక్.. గౌతమ్ గంభీర్‌ కు పలికిన ధరే. అతడిని కేవలం రూ.2.8 కోట్లు పెట్టి ఢిల్లీ డేర్‌ డెవిల్స్ సొంతం చేసుకుంది.

ఐదేళ్ల కిందట గంభీర్‌ ను దాదాపు రూ.11 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది కోల్‌ కతా నైట్‌ రైడర్స్. తొలి మూడు సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన కోల్‌ కతా‌ను గాడిన పెట్టి.. ఆ జట్టును ఒకటికి రెండుసార్లు విజేతగా నిలిపిన ఘనత గంభీర్‌ దే. అలాంటి ఆటగాడిని ఈ సీజన్‌ కు అట్టిపెట్టుకోకుండా కోల్‌ కతా వదిలేయడం షాక్ అయితే.. ఇప్పుడు వేలంలో తక్కువ ధరకు వస్తున్నా ఆ ఫ్రాంఛైజీ అతడిని దక్కించుకోకపోవడం.. మిగతా ఫ్రాంఛైజీల నుంచి కూడా పెద్దగా పోటీ లేక ఢిల్లీ చాలా తక్కువ ధరకు అతడిని తీసుకోవడం మరో షాక్.

ఇక తొలి రోజు వేలంలో అత్యధిక ధర పలికింది ఇంగ్లాండ్‌ ఆల్‌ రౌండర్ బెన్ స్టోక్సే. అతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.12.5 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది స్టోక్స్‌ ను రూ.14.5 కోట్లకు పుణె సూపర్ జెయింట్స్ కొన్నది. ఐతే ఓ దాడి కేసులో చిక్కుకున్న స్టోక్స్ ఐపీఎల్‌ కు పూర్తిగా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందేహంగా ఉన్నప్పటికీ అతడికి మంచి రేటే పలికింది. అతడి తర్వాత ఇద్దరు యువ భారత బ్యాట్స్‌ మెన్‌ ను రూ.11 కోట్ల చొప్పున పలికింది. మనీష్ పాండేను సన్‌ రైజర్స్ - కేఎల్ రాహుల్‌‌ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ రేటుకు కొన్నాయి. ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ లిన్ రూ.9.6 కోట్లకు కోల్‌ కతా సొంతమయ్యాడు. ఆ ఫ్రాంఛైజీ మిచెల్ స్టార్క్‌ కోసం రూ.9.4 కోట్లు పెట్టింది. ఇంకా గ్లెన్ మాక్స్‌వెల్‌ను రూ.9 కోట్లకు ఢిల్లీ - అశ్విన్‌ ను పంజాబ్ రూ.7.6 కోట్లకు పంజాబ్ - డ్వేన్ బ్రావోను రూ.6.4 కోట్లకు చెన్నై సొంతం చేసుకున్నాయి.