Begin typing your search above and press return to search.

గౌరీ లంకేష్ హ‌త్య‌కేసులో షాకింగ్ నిజాలు!

By:  Tupaki Desk   |   8 Jun 2018 7:45 AM GMT
గౌరీ లంకేష్ హ‌త్య‌కేసులో షాకింగ్ నిజాలు!
X
గత ఏడాది సెప్టెంబర్‌ 5న క‌ర్ణాట‌క‌లోని సీనియర్‌ జర్నలిస్టు - ర‌చ‌యిత్రి గౌరీ లంకేశ్‌ హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. లౌకికవాదిగా - కన్నడ వార పత్రిక ‘లంకేశ్‌ పత్రికే’ ఎడిటర్ గా పాపుల‌ర్ అయిన గౌరీ లంకేశ్ ను ఆమె ఇంటి ద‌గ్గ‌రే దారుణంగా కాల్చి చంప‌డం క‌ల‌క‌లం రేపింది. దేశ‌వాళీ 7.65 ఎంఎం నాటు తుపాకీతో గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఆమెపై కాల్పులు జ‌ర‌ప‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. క‌ల్బుర్గి - ద‌బోల్క‌ర్ - ప‌న్సారే త‌ర‌హాలోనే గౌరీ హ‌త్యకు హిందూ అతివాద సంస్థ‌లే కార‌ణమ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. ఈ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు ప్ర‌వీణ్ - అత‌డికి బుల్లెట్లు స‌ర‌ఫ‌రా చేసి స‌హ‌క‌రించి కేటీ నవీన్‌ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుకు స‌మ‌ర్పించిన చార్జీషీట్ లో గౌరీ లంకేశ్ హత్యకు గ‌త కార‌ణాల‌ను సిట్ వెల్ల‌డించింది. పోలీసుల విచార‌ణ‌లో న‌వీన్ అనేక సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించాడు. గౌరీ లంకేశ్‌ హిందూ వ్యతిరేకి అని....ఆమెకు బతికే అర్హత లేదని ప్ర‌వీణ్ తనతో చెప్పినట్లు నవీన్ అంగీక‌రించిన విష‌యాన్ని పోలీసులు చార్జీషీటులో పొందుప‌రిచారు. ప్ర‌వీణ్ కు బుల్లెట్లు తానే స‌ర‌ఫ‌రా చేశాన‌ని న‌వీన్ అంగీక‌రించిన‌ట్లు పోలీసులు తెలిపారు. 131 పాయింట్లతో 12 పేజీల ఛార్జీ షీట్‌ ను మే 30న మెజిస్ట్రేట్‌ కు సిట్‌ సమర్పించింది.

డిగ్రీ డ్రాప‌వుట్ అయిన నవీన్ .... హిందూ అతివాద సంఘాల పట్ల ఆకర్షితుడై 2014లో హిందూ యువ సేనే అనే సంస్థను స్థాపించాడు. అక్రమ ఆయుధాల‌ సరఫరా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న న‌వీన్ కు ప్ర‌వీణ్ ప‌రిచ‌య‌మయ్యాడు. ఈ క్ర‌మంలో ప్ర‌వీణ్ కు నవీన్‌ రెండు బుల్లెట్లు ఇచ్చాడు. హిందూ వ్యతిరేకి అయిన గౌరీ లంకేశ్ ను చంపేందుకు త‌న‌కు నాణ్యమైన బుల్లెట్లు కావాలని ప్ర‌వీణ్ ....న‌వీన్ తో చెప్పాడు. బెంగళూరులోని గౌరీ ఇంటి వద్ద పలు మార్లు ప్ర‌వీణ్ తో పాటు మ‌రి కొంత‌మంది హంతకులు రెక్కీ నిర్వహించారని పోలీసుల‌కు న‌వీన్ తెలిపాడు. అయితే, నాణ్య‌మైన బుల్లెట్లు స‌ర‌ఫ‌రా చేసే డీల‌ర్ తో మాట్లాడిన న‌వీన్...ప్ర‌వీణ్ ను కాంటాక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేసినా అత‌డికి ఫోన్ లేక‌పోవ‌డంతో అందుబాటులోకి రాలేదు. ప‌థ‌కం ప్ర‌కారం ప్ర‌వీణ్ సెప్టెంబర్ 5న గౌరీని హత్య చేసినట్లు నవీన్ తెలిపాడు. ఆమె హత్యకు గురైందన్న సంగ‌తి మరుసటి రోజు పేపర్ చూసే వ‌ర‌కు త‌న‌కు తెలీద‌ని నవీన్ వెల్ల‌డించాడు. మరోవైపు, సాహితీవేత్త - హేతువాది కేఎస్ భగవాన్‌ హత్యకు కూడా కుట్ర పన్నినట్లు నవీన్‌ అంగీకరించాడు. కుల్బర్గి(77) హత్య కోసం ఉపయోగించిన తుపాకీ - గౌరీ లంకేశ్‌ హత్య కోసం వాడిన తుపాకీ ఒక్కటేనని ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించిన‌ట్లు ఛార్జీషీట్‌ లో పొందుపరిచారు.