Begin typing your search above and press return to search.

గద్వాల్ లో ఇళ్లకు వేసిన తాళాలు తీసేశారు.. కారణం అదేనా?

By:  Tupaki Desk   |   28 April 2020 5:15 AM GMT
గద్వాల్ లో ఇళ్లకు వేసిన తాళాలు తీసేశారు.. కారణం అదేనా?
X
అదే పనిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ.. అధికారులు స్పందించాల్సిందే. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలా అని ఓవరాక్షన్ అస్సలు పనికి కాదు. యాక్షన్ కు.. ఓవరాక్షన్ కు మధ్యనున్న సన్నటి గీతను మిస్ అయిన గద్వాల జిల్లా అధికారులకు జరగాల్సిన శాస్తి జరిగిందన్న మాట వినిపిస్తోంది. గద్వాల్ లో ఇటీవల పాజిటివ్ కేసులు నమోదువుతున్న వేళ.. ఆ జిల్లా అధికారలు ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యారు.

పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్ని కంటైన్ మెంట్ కేంద్రాలుగా మార్చేయటమే కాదు.. కరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవటమే కాదు.. ఆ ప్రాంత ప్రజలు ఇళ్లలో నుంచి బయటకురాకుండా ఉండేలా ఇళ్లకు తాళాలు వేసేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనాపాజిటివ్ కేసులు వెలుగు చూసినా.. మరెక్కడా లేని రీతిలో గద్వాల్ లోని ఇళ్లకు తాళాలు వేసిన అంశం సీఎం కేసీఆర్ వరకూ వెళ్లిందని చెబుతున్నారు. ప్రసార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రసారం కావటం.. జనాల్ని ఇళ్లల్లో ఉంచి తాళాలు వేయటాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణించారని చెబుతున్నారు. వెంటనే కలెక్టరును లైన్లోకి తీసుకున్నట్లుగా సమాచారం.

దీంతో.. సీన్ మొత్తంగా మారిందంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పరుగు.. పరుగున వెళ్లిన అధికారులు తాము ఇళ్లకు వేసిన తాళాల్ని తీసేశారు. గద్వాల పుట్టణంలో కరోనాపాజిటివ్ కేసులున్న వ్యక్తి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్ల ప్రహరీ గోడలకు తాళాలు వేసిన వైనాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం.. ప్రజలకు అవగాహన కలిపించాలే కానీ.. అనవసరమైన భయాందోళనలకు గురయ్యేలా అధికారుల చర్యలు ఉండకూడదంటున్నారు. ఈ కారణం తోనే ఇళ్లకు వేసిన తాళాల్ని తీయించినట్లుగా చెబుతున్నారు.