Begin typing your search above and press return to search.

ముంబైని కమ్మేసిన గ్యాస్.. హైఅలెర్ట్

By:  Tupaki Desk   |   20 Sep 2019 5:40 AM GMT
ముంబైని కమ్మేసిన గ్యాస్.. హైఅలెర్ట్
X
మహానగరం ముంబైని గ్యాస్ లీకేజీ భయపెట్టింది. ఓ వైపు భారీ వర్షాలతో రోడ్లు - కాలనీలు మొత్తం జలమయమైన వేళ నిన్న రాత్రి 10.45 నిమిషాల నుంచి ముంబై అంతటా గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. ఆ గ్యాస్ పీల్చి చాలా మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. ఇక గ్యాస్ లీకేజీతో నిప్పు రాజేయడానికి - అగ్గిపుల్ల వెలిగించడానికి జనాలు హడలి చచ్చారు. వంటలు వండడం కూడా ఆపేశారు.

ముంబైవ్యాప్తంగా మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ భూగర్భంలో పైపులను అమర్చి ముంబైకి గ్యాస్ సరఫరా చేస్తోంది. అక్కడి నుంచి లీక్ అయ్యి ఉండవచ్చని తొలుత అనుమానించారు. ఆ తర్వాత కంట్రోల్ రూం ద్వారా చెక్ చేయగా అక్కడి నుంచి వెలువడలేదని తేల్చారు.

గ్యాస్ లీకేజీపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో అగ్నిమాపక - పోలీసులు - బీఎంసీ ప్రకృతి వైపరీత్యాల విభాగం రంగంలోకి దిగింది. ఆయా ప్రాంతాల్లో మోహరించి రక్షణ చర్యలు చేపట్టింది. మహానగర్ గ్యాస్ సరఫరాను నిలుపుదల చేశారు. ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫోన్లు స్వీకరించి వారి సమస్యలు తీర్చారు.

అయితే ఈ గ్యాస్ లీక్ కావడానికి ప్రధాన కారణంగా చెంబూర్ చకలా ప్రాంతంలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఎరువుల కర్మాగారం అని ప్రాథమికంగా నిర్ధారించారు. అక్కడ ఎరువులు తయారు చేసే సమయంలో గ్యాస్ లీక్ అయినట్టు గుర్తించారు. ఇది ముంబై అంతటా వ్యాపించిందని గుర్తించారు. దీంతో అక్కడ రక్షణ చర్యలు చేపట్టారు.