Begin typing your search above and press return to search.

అలా మాట్లాడటానికి నోరెలా వచ్చింది గరికపాటి

By:  Tupaki Desk   |   29 July 2016 4:43 AM GMT
అలా మాట్లాడటానికి నోరెలా వచ్చింది గరికపాటి
X
ఆంధ్రోళ్లే కదా అని తక్కువగా అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా షాకిచ్చారు ఆంధ్రులు. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించి సంచలనం సృష్టించిన ఇందిరాగాంధీ నిర్ణయాన్ని దేశం మొత్తం ఛీ కొట్టి.. ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేసిన వేళ.. తెలుగోళ్లు మాత్రం కాంగ్రెస్ కు అండగా నిలబడిన చారిత్రక సత్యాన్ని కాంగ్రెస్ గుర్తు పెట్టుకోకపోవటాన్ని ఆంధ్రోడు అవమానంగా భావించారు. అందుకే.. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైతే.. తెలుగు నేల మీద మాత్రం ఇందిరమ్మ మీద ఉన్నఅభిమానం.. ఆమె చేసిన ‘అత్యయిక’ తప్పును క్షమించేలా చేసి.. ఆమెకు ఓట్లు వేసేలా చేసింది.

ఈ కారణంతోనే 42 పార్లమెంటు సీట్లకు అత్యధికంగా సీట్లు ఏపీ నుంచి దక్కాయి. అలాంటి తెలుగోడు.. రాష్ట్రవిభజన సందర్భంగా ఏపీ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన వైఖరికి నిరసనగా.. ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానంలో కూడా గెలవకుండా చేశాడు. ఆంధ్రోడిని అవమానించిన దానిని.. అతగాడి భావోద్వేగాల్నిపట్టించుకోకపోవటానికి ఫలితాన్ని కాంగ్రెస్ ఇప్పుడు అనుభవిస్తోంది. పదేళ్లు నాన్ స్టాప్ అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్.. విభజన కారణంగా మహా అయితే ఐదేళ్లు విపక్షంలో ఉంటామని ఫీలయ్యిందే తప్పించి.. ఏపీలో తమ అడ్రస్ పూర్తిగా గల్లంతు అవుతుందని ఎంతమాత్రం ఊహించలేదు.

ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తూ మొండిగా.. మూర్ఖంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎంత శిక్ష వేయాలో అంత శిక్ష వేశారు ఆంధ్రోళ్లు. ఇలాంటివి చూసిన తర్వాత అయినా ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరించాల్సిన అవసరం ఏపీ అధికారపక్షంపై ఉంది. కానీ.. చరిత్రను మర్చిపోయిన తెలుగుదేశం పార్టీ ఏ తప్పు చేయకూడదో అదే తప్పు చేయటం గమనార్హం.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో చర్చ జరగ్గా.. తెలంగాణతో సహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలన్నీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ముక్తకంఠంతో చెబితే.. అందుకు భిన్నంగా బీజేపీతో తన మిత్రధర్మాన్ని సాకుగా చూపిస్తూ ఆంధ్రోళ్ల ప్రయోజనాలకు భంగం కలిగేలా ఏపీ అధికారపక్ష నేతలు మాట్లాడటం షాకింగ్ అనే చెప్పాలి. టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు గరికపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. టీడీపీ.. బీజేపీలు అన్నదమ్ముల్లా కలిసి పోటీ చేశాయని.. ఇద్దరిని విడగొట్టాలన్న భావన కాంగ్రెస్ కు ఉన్నట్లుగా తమకు అనుమానం ఉందని చెప్పిన ఆయన.. హోదాపై పెట్టిన బిల్లు విషయంలో పోరాటం చేస్తామన్నారు. ఓపక్క అన్ని రాజకీయ పక్షాలు హోదాకు అనుకూలంగా మాట్లాడి.. తమ పూర్తి మద్ధతు ప్రకటించిన వేళ.. గరికపాటి వారు పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? వారందరితో కలిపి మరింత బలంగా ఏపీకి ప్రత్యేకహోదాఎందుకు ఇవ్వాలన్న అంశంపైమాట్లాడితే సరిపోతుంది కదా.

గరికపాటి తీరు చూస్తే అనిపించేది ఒక్కటే. ఏపీ అధికారపక్షానికి ఏపీ ప్రజల ప్రయోజనాల కన్నా కూడా.. కేంద్రంలోని మోడీ సర్కారుతో అనుబంధమే ముఖ్యమన్నట్లుగా అనిపించక మానదు. ఏపీ ప్రజల అండ ఉంటే తప్ప.. ఏపీ అధికారపక్షాన్ని మోడీ పట్టించుకోరన్న లాజిక్ ను చంద్రబాబు ఎందుకు మిస్ అయ్యారన్న భావన కలగక మానదు. చంద్రబాబు చెప్పారో.. లేక గరికపాటి వారి సొంత కవిత్వమో కానీ.. ఆయన మాటలు విన్న వారంతా తిట్టిపోసే పరిస్థితి. ఆంధ్రులకు శత్రువుగా కొందరు ఫీలయ్యే టీఆర్ఎస్ పార్టీ (రాష్ట్ర విభజన చేయించిందని) నే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేస్తే.. అదేమాటను సూటిగా.. స్పష్టంగా చెప్పే దమ్ము ఏపీ అధికారపక్ష పార్టీకి చెందిన గరికపాటికి లేకపోవటం ఏమిటి? ఇంతకంటే దురదృష్టకరం ఇంకేమైనా ఉంటుందా?