Begin typing your search above and press return to search.

తెలుగు ప్ర‌జ‌ల‌కు హీరోగా మారిన గ‌రిక‌పాటి!

By:  Tupaki Desk   |   17 Dec 2017 5:31 AM GMT
తెలుగు ప్ర‌జ‌ల‌కు హీరోగా మారిన గ‌రిక‌పాటి!
X
పాల‌కులు ఏం చేసినా.. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా చూస్తూ ఉరుకుండిపోవ‌టం ఏమాత్రం మంచిది కాదు. ప్ర‌జాస్వామ్యంలో పాల‌కుల త‌ప్పుల్ని ఎత్తి చూపించ‌క‌పోవ‌టం.. వారిని విమ‌ర్శ‌ల‌తో క‌డిగేయ‌క‌పోవ‌టం అంటే ప్ర‌జాస్వామ్యాన్ని ఎవ‌రికి వారు తూట్లు పొడుస్తున్న‌ట్లే.

పాల‌కుల‌కు క‌ట్టుబానిస‌ల మాదిరి వ్య‌వ‌హ‌రిస్తూ.. వారేం చేసినా.. ఆహా.. ఓహో అంటూ భ‌జ‌న చేయ‌టం మంచిది కాదు. మంచి విష‌యంలో మంచి చెబుతూ.. చెడు విష‌యంలో త‌ప్పుల్ని ఎత్తి చూప‌టం ద్వారా పాల‌కులు మ‌రిన్ని త‌ప్పులు చేయ‌కుండా చూడాల్సిన బాధ్య‌త వ్య‌వ‌స్థ‌లో అంద‌రి మీదా ఉంది.

ఎవ‌రికి వారు.. మ‌న‌కెందుకులే అన్న‌ట్లుగా ఉండ‌టం.. పాల‌కుల ప‌వ‌ర్ కు వంగి స‌లామ్ చేసే తీరు ఏ మాత్రం మంచిది కాదు. పోరాడి సాధించుకున్న తెలంగాణ‌లో భావ‌స్వేచ్ఛ ఎక్కువ‌గా ఉండాలి. ఎవ‌రైనా త‌మ అభిప్రాయాన్ని నిర్మోహ‌మాటంగా చెప్పుకోవ‌టం త‌ప్ప‌నిస‌రి. ఎందుకంటే.. పోరాట‌ల పురిటి గ‌డ్డకు ప్ర‌శ్నించే త‌త్త్వం లేకున్నా.. పాల‌కుల్ని క‌డిగిపారేసే తీరు అస‌లే లేకున్నా తెలంగాణ రాష్ట్ర స్వ‌ప్నం సాక్ష్యాత్క‌రించేది కాదన్న‌ది మ‌ర‌చిపోకూడ‌దు.

అలాంటి గ‌డ్డ మీద తాజాగా నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల విష‌యంలో పాల‌కుల త‌ప్పుల్ని ఎత్తి చూపించేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌టం క‌నిపిస్తుంది. ప్రముఖ మీడియా సంస్థ‌లు సైతం ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే త‌ప్ప‌.. జ‌రుగుతున్న త‌ప్పుల్ని ఎత్తి చూపించేందుకు అంత ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌ని వేళ‌.. అందుకు భిన్నంగా ఒకరు గ‌ళం విప్ప‌టం అంత చిన్న విష‌యం కాదు.

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల పేరుతో నిర్వ‌హిస్తున్న స‌భ‌ల‌కు ప్ర‌పంచంలో ఎక్క‌డో ఉన్న తెలుగు వారిని సైతం హైద‌రాబాద్‌ కు ఆహ్వానిస్తున్న వేళ‌.. అమ్మ భాష‌కు పండుగ చేస్తున్న వేళ‌.. తెలంగాణ ప‌క్క‌నే ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబును ఆహ్వానించ‌క‌పోవటాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

తెలుగు పేరుతో చేస్తున్న పండుగ‌కు తెలుగు వారిని పిల‌వ‌కుండా అవ‌మానిస్తారా? ఇదేం ప‌ద్ద‌తి అంటూ తెలంగాణ ప్ర‌జ‌లు సైతం ప్ర‌శ్నిస్తున్న వేళ‌.. వారి మాట‌లు మీడియాకు రాని వేళ‌.. స‌హ‌స్త్రావ‌ధానిగా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులైన గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు స్పందించ‌టం.. ఒక ఎత్తు అయితే.. త‌న నిర‌స‌న‌ను త‌న‌దైన శైలిలో సూటిగా.. పొందిగ్గా చెప్పేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

తెలుగు మ‌హాస‌భ‌లకు ఆహ్వానం అంద‌క‌పోవ‌టంపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆచితూచి స్పందించిన వేళ‌.. త‌మ పాల‌కుడ్ని అవమానించిన స‌భ‌ల‌కు తాను పాలుపంచుకునేది లేదంటే లేదంటూ గ‌రిక‌పాటి వారు చేసిన విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న తెలుగు ప్ర‌జ‌ల్లో హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు చెందిన ప‌లువురికి చాలా త‌క్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. అప్ప‌టికి కొంద‌రిని ఆహ్వానించారు. అలాంటి వారిలో ఒక‌రు గ‌రిక‌పాటి. త‌న‌ను ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు ఆహ్వానించిన‌ప్ప‌టికీ త‌మ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు నాయుడిని ఆహ్వానించ‌ని స‌భ‌ల‌కు తాను వెళ్ల‌లేన‌ని స్ప‌ష్టం చేశారు గ‌రికపాటి.

త‌మ పాల‌కుడైన నాయ‌కుడికి ఆహ్వానం అంద‌ని స‌భ‌ల‌కు.. తాను హాజ‌రు కాన‌ని.. ఐదు కోట్ల తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌తినిధి అయిన ఏపీ ముఖ్య‌మంత్రిని పిల‌వ‌కుండా త‌న‌ను పిలిస్తే తాను ఎలా వెళ‌తాన‌న్న ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తిన గ‌రిక‌పాటి తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన ఆహ్వానాన్ని తిర‌స్క‌రించారు. కొమ్ములు తిరిగినట్లుగా చెప్పుకునే మీడియా సైతం తెలంగాణ‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేస్తున్న త‌ప్పుల్ని ఎత్తి చూపించేందుకు వెనుకాడుతున్న వేళ‌.. గ‌రిక‌పాటి మాత్రం త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌కు చెప్పేసి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఊహించ‌ని రీతిలో షాకిచ్చారు.