Begin typing your search above and press return to search.

టీడీపీలో హవా కొనసాగేనా : గంటా ఏం చేయబోతున్నారు ...?

By:  Tupaki Desk   |   19 July 2022 11:30 AM GMT
టీడీపీలో హవా కొనసాగేనా :  గంటా ఏం చేయబోతున్నారు  ...?
X
ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం చేయబోతున్నారు అన్నదే ఇపుడు పార్టీ లోపలా బయటా సాగుతున్న ఆలోచనలు. గంటా ఆషా మాషీ మనిషి కాదు, ఆయన రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాన్ని పండించుకున్న నేత. టీడీపీలో ప్రవేశించి తొలిసారి ఎంపీ అయిన ఆయన ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి చక్రం తిప్పారు. ఆ మీదట కాంగ్రెస్ లో చేరి మంత్రి కూడా అయ్యారు. తిరిగి టీడీపీలోకి వచ్చి మంత్రిగా అయిదేళ్ళ పాటు గత సర్కార్ లో పనిచేశారు.

పార్టీ 2019 ఎన్నికల్లో ఓడగానే గంటా సైలెంట్ అయ్యారు. మూడేళ్ళుగా ఆయన పెద్దగా యాక్టివిటీ కూడా ఏమీ చేపట్టలేదు. అంతవరకూ ఎందుకు ఎన్నో సార్లు పార్టీ సమావేశాలు జరిగినా గంటా గైర్ హాజర్ అయ్యేవారు. అఖరుకు మూడేళ్ళ తరువాత టీడీపీ ఆర్భాటంగా నిర్వహించిన మహానాడుకు కూడా ఆయన డుమ్మా కొట్టారు.

ఈ నేపధ్యంలో గంటా టీడీపీలో ఉంటారా లేక వేరే పార్టీలోకి వెళ్తారా అన్న చర్చ అయితే సాగింది. అయితే గంటా మాత్రం ఈ మధ్య ఒక స్థిరమైన నిర్ణయమే తీసుకున్నారు అని అంటున్నారు. ఆయన టీడీపీలోనే ఉంటారని చెబుతున్నారు. ఈ మధ్య ఆయన ఏపీలో వచ్చేది టీడీపీ సర్కార్ మాత్రమే అని కూడా గట్టిగా సౌండ్ చేస్తున్నారు. అయితే గంటాకు అధినాయకత్వంలో గ్యాప్ ఉందన్న ప్రచారం గట్టిగానే ఉంది.

దానికి ఉదాహరణ అన్నట్లుగా ఈ మధ్య చోడవరంలో జరిగిన మినీ మహానాడుకు చంద్రబాబు విశాఖ వస్తే ఎయిర్ పోర్టుకు వెళ్ళిన గంటాకు బాబు నుంచి పెద్దగా పలకరింపులు లేవని ప్రచారం జరిగింది. దాంతో గంటా ఆలోచనలో పడ్డారని అంటున్నారు. ఇక లాభం లేదని ఆయన బాబుని ప్రసన్నం చేసుకునేందుకే తాజాగా ఆయన ఉంటున్న ఉండవల్లి నివాసానికి వెళ్ళి మరీ కలసి వచ్చారని అంటున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు అంతా పార్టీ ఆఫీసులో ఉంటే గంటా మాత్రం నేరుగా బాబు ఇంటికి వెళ్లడం వెనక రాజకీయ మంత్రాంగమే ఉందని అంటున్నారు. బాబుతో తన బంధాన్ని అనుబంధాన్ని పెంచుకోవడానికే ఆయన ఇలా చేశారని చెబుతున్నారు. ఇక గంటా అసెంబ్లీకి కూడా పెద్దగా హాజరైన దాఖలాలులేవు. ఆ మధ్య స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసే కేంద్రం నిర్ణయాని నిరసిస్తూ గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అని అంటున్నారు.

అది స్పీకర్ తమ్మినేని సీతారామ్ వద్ద పెండింగులో ఉంది. అయితే గంటా మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కుని ఉపయోగించుకుని ఆ తీసిన ఫోటోను తన ట్విట్టర్ లో కూడా పెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే మూడేళ్ల వైసీపీ ఏలుబడిలో మొత్తానికి మొత్తం టీడీపీ నేతల మీద కేసులు పెద్ద ఎత్తున పడ్డాయి. ఇక విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి మీద అనేక కేసులు ఉన్నాయి. ఈ మధ్యనే ఆయన ఉంటున్న ఇంటి గోడను కూడా అధికారులు కూల్చితే అది రాజకీయ రచ్చగా మారింది.

అయినా గంటా నుంచి ఏ మాత్రం స్పందన లేదు. ఇంతటి భీకరమైన పోరు వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉన్న సరే గంటా మీద ఒక్క కేసు కూడా లేకపోవడం విశేషం. అంటే గంటా పనిచేయలేదని, ఆయన పోరాటాలు చేయలేదని పార్టీలో ఆయన ప్రత్యర్ధులు అంటున్నారు. ఇక విశాఖ జిల్లాలో గంటా వర్సెస్ అయ్యన్నగా ఉంటుంది. దాంతో అయ్యన్న పార్టీ కోసం కష్టపడుతున్నారని, ఆయనకే రానున్న రోజుల్లో ప్రాధాన్యత ఉంటుందని కూడా చెబుతున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో బాబు మదిలో ఏముందో తెలుసుకోవడానికి గంటా ఆయన ఇంటికి వెళ్లారని అంటున్నారు. ఏది ఏమైనా పనిచేయని నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వను అని ఖరాఖండీగా చంద్రబాబు చెబుతున్న వేళ టీడీపీలో గంటా రాజకీయం ఏ విధంగా ఉంటుంది. చంద్రబాబు ఆయన పట్ల ఏ వైఖరిని అనుసరిస్తారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. మరో వైపు చూస్తే నియోజకవర్గం ఏదైనా పార్టీ ఏదైనా తాను గెలిచే సత్తాను కలిగి ఉన్న గంటా ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవవధి ఉంది కాబట్టి దానికి తగినట్లుగా తన ఆలోచనలకు పదును పెడతారు అని అంటున్నారు. మొత్తానికి గంటా తన రాజకీయ ప్రాధ్యాన్యత తగ్గకుండా ఉండేలాగానే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు అని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.