Begin typing your search above and press return to search.

ఈ ఎంఎల్ఏకి కూడా టికెట్ ఖాయమేనా ?

By:  Tupaki Desk   |   18 Sept 2022 4:00 PM IST
ఈ ఎంఎల్ఏకి కూడా టికెట్ ఖాయమేనా ?
X
సిట్టింగ్ ఎంఎల్ఏలందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని చంద్రబాబునాయుడు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు అలా ప్రకటన చేశారో లేదో కొందరు నేతలు ఇలా వెంటనే పార్టీ ఆఫీసుకు వచ్చేశారు. తమ ఎంఎల్ఏకి టికెట్ ఇస్తే గెలవరని వేరే ఎవరికైనా నియోజకవర్గం ఇన్చార్జిని నియమించాలని చెప్పారు. దాంతో ఈ విషయమై తొందరలోనే నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెప్పి పంపేశారు.

ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ ఎంఎల్ఏల్లో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుండి గెలిచిన గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. గడచిన మూడున్నరేళ్ళుగా ఈయనసలు పార్టీతో టచ్ లోనే లేరు. తనిష్టం వచ్చినపుడు పార్టీ కార్యక్రమంలో కనబడతారు లేకపోతే లేదంతే. గంట ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుందామని చంద్రబాబు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. తన దగ్గరకు వచ్చి మాట్లాడాలని కబురుచేసినా పెద్దగా రెస్పాండ్ కావటంలేదు.

మూడున్నరేళ్ళల్లో మహా అయితే చంద్రబాబును గంటా రెండుసార్లు కలిసుంటారంతే. చంద్రబాబును కలవరు, పార్టీలోని సీనియర్లతో మాట్లాడరు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు. మరిలాంటి గంటాకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎలా ఇస్తారంటు నియోజకవర్గంలోని నేతలు చంద్రబాబును అడిగారట. ఈయనకే మళ్ళీ టికెట్ ఇస్తే ఓడిపోవటం ఖాయమని కూడా తేల్చిచెప్పారట. అసలు గంటా మనసులో ఏముందో కూడా ఎవరికీ తెలీదు. రాజకీయాల్లో కంటిన్యు అవటం ఇష్టంలేదా ? లేకపోతే టీడీపీలో ఉండటం ఇష్టంలేదా అన్న విషయంలో కూడా ఎవరికీ క్లారిటి ఇవ్వటంలేదు.

దీనివల్ల చంద్రబాబుకు సమస్య ఏమిటంటే ఉత్తరం నియోజకవర్గంలో తమకు ఎంఎల్ఏ ఉన్నారని అనుకోవాలో లేరని తీర్మానించుకోవాలో అర్ధం కావటంలేదు. ఎంఎల్ఏ ఉన్న కారణంగా మరోనేతకు ఇన్చార్జి బాధ్యతను కూడా అప్పగించలేకపోతున్నారు. గంటా వ్యవహారం ఎలాగైపోయిందంటే 'అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు' అన్న సామెతలాగైపోయింది. ఈ పరిస్దితిని చక్కదిద్దమని నియోజకవర్గంలోని నేతలు పదే పదే చంద్రబాబును కలుస్తున్నారు. ఏమిచేయాలో చంద్రబాబుకు కూడా అర్ధం కావటంలేదు.