Begin typing your search above and press return to search.

గంటా వాయిస్ : బాబే ఏపీకి దిక్కు

By:  Tupaki Desk   |   24 May 2022 5:00 AM IST
గంటా వాయిస్ :  బాబే  ఏపీకి దిక్కు
X
ఏపీని గాడిలో పెట్టాలీ అంటే అది ఒక్క చంద్రబాబు వల్లనే సాధ్యపడుతుంది అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నొక్కి వక్కాణించారు. ఈ మాటను ఆయన తనను గెలిపించిన సొంత నియోజకవర్గం విశాఖలొని  ఉత్తరం నుంచి గట్టిగా చెప్పారు. బాబుతోనే ఏపీ సమగ్ర అభివృద్ధి సాధ్యం. ఇదే మన నినాదం కావాలి  తమ్ముళ్ళూ అని క్యాడర్ ని ఉత్సాహాపరచారు.

గంటా ఈ మధ్యకాలంలో ఫుల్  సైలెంట్ అయ్యారని, ఆయన విశాఖ వచ్చినా బాబుని కలవలేదని జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ బాబు ఒక్కరే  ఏపీకి దిక్కు అంతే అని రెండవ మాటకు తావు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు. ఏపీకి మంచి జరగాలంటే చంద్రబాబుని సీఎం గా ఎన్నుకోవడం తప్ప మరో మార్గం లేదని కూడా ఆయన అన్నారు.

ఇక ఏపీలో గాలి మారిందని కూడా విశాఖ అక్టోపస్ చాలా చక్కగా  చెప్పేశారు. వివిధ జిల్లాలలో  చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి జనాలు వెల్లువలా వస్తూంటే వైసీపీ గడప గడపకూ ప్రోగ్రాం వెల వెలపోతోందని ఆయన విశ్లేషించారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం పట్ల విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందని కూడా ఆయన అంటున్నారు.

దీన్ని జాగ్రత్తగా వాడుకుంటే వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు అసలు తావు లేదని కూడా గంటా చెప్పుకొచ్చారు. మొత్తానికి గంటా మళ్లీ మోగింది. ఈసారి ఖంగున మోగింది. ఇదే జోరుతో ఇక మీదట విశాఖలో ప్రతీ చోటా  జేగంట ప్రతిద్వనిస్తుందా. చూడాలి.