Begin typing your search above and press return to search.

గంటా...అర్ధం కావడం లేదంటా..?

By:  Tupaki Desk   |   5 May 2022 3:33 PM GMT
గంటా...అర్ధం కావడం లేదంటా..?
X
ఆయన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు కూడా. ఆయనే విశాఖ జిల్లా నేత గంటా శ్రీనివాసరావు. ఆయనకు చాలా తెలివి తేటలు ఉన్నాయి. రాజకీయ చాణక్యంలో చంద్రబాబుతో సరిసమానం అని కూడా అంటారు. ఇక గెలుపు తప్ప ఓటమి ఎరుగని వీరుడు, ఎటువంటి సవాల్ ని అయినా స్వీకరించి తనకు అనుకూలం చేసుకోగల ధీరుడూ ఆయన. అలాంటి గంటా ఇపుడు టీడీపీ తమ్ముళ్ళకు అర్ధం కావడంలేదు అంటున్నారు.

ఎందుకిలా జరుగుతోంది అంటే ఏమో మాజీ మంత్రి గారే చెప్పాలి దానికి అంటున్నారు. గంటా 2019 నుంచి కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇక దాని కంటే ముందు తీసుకుంటే నాడు సీఎం గా చంద్రబాబు విశాఖకు వస్తే నాటి సభలో పాల్గొనను అని మారాం చేసిన మంత్రివర్యులు ఆయనే. చివరికి నాటి ఇంచార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప గంటా వారింటికి వెళ్ళి ఆయనకు నచ్చచెప్పి బాబు పక్కన సభలో కూర్చోబెట్టారు.

అది ఆరంభం అనుకుంటే ఎన్నికల దాకా ఇంకా చెప్పాలంటే టికెట్ల వ్యవహారం, సీటు ఎక్కడ అన్న దాని వద్ద కూడా అధినాయకత్వంతో గంటా ఎపుడూ డిఫర్ అవుతూ వచ్చారు. భీమిలీ సీటును గంటాకు ఇవ్వకుండా విశాఖ ఎంపీగా పంపాలని అధినాయకత్వం నాడు ప్లాన్ చేస్తే మొత్తానికి చివరి నిముషంలో ఉత్తర నియోజకవర్గం టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యే అయ్యారు గంటా.

అలా కొన్ని అభిప్రాయభేదాలు అనాలో గ్యాప్ అనాలో తెలియదు కానీ ఏదో ఒకటి ఉంది అని చెప్పాలి. ఈ నేపధ్యంలో టీడీపీ అధికారం కోల్పోవడం, గ్రాఫ్ దారుణంగా పడిపోవడంతో గంటా సైలెంట్ అయ్యారు. కొన్నాళ్ళు పక్క చూపులు చూశారు అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఏది అయితేనే కొద్ది నెలలుగా గంటా క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. టీడీపీలోనే తాను అని కూడా చెబుతున్నారు.

ఆయన ఈ మధ్య లోకేష్ బర్త్ డే వేడుకలు కూడా హుషార్ గా తన ఇలాకాలో చేశారు. చంద్రబాబు సీఎం అవుతారు అని గట్టిగానే అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రా టూర్ కి బాబు వస్తే ఆయనకు స్వాగతం పలికారు. అవన్నీ బాగానే ఉన్నాయనుకుంటే పార్టీ నేతలతో బాబు మీటింగ్ పెడితే మాత్రం గంటా గైర్ హాజరు అయ్యారు. సొంత జిల్లాకు అధినాయకుడు వచ్చి మీటింగ్ పెడితే డుమ్మా కొట్టడమేంటి అన్నదే చర్చగా ఉంది.

దాంతో గంటా మళ్ళీ అర్ధం కాకుండా పోతున్నారా అన్న మాట వినిపిస్తోంది. ఇంకో వైపు చూస్తే గంటా రాకపోవడం పట్ల రకరకాలైన ప్రచారం సాగుతోంది. గంటా అంటే పడని వారు టీడీపీలోనే ఉన్నారు. వారి మాటకు విలువ పెరుగుతోందని, వారికే ప్రాముఖ్యత లభిస్తోందని భావనతో గంటా ఉన్నారు అంటున్నారు.

అదే టైమ్ లో గంటా అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి ఆయన తనకు టికెట్ ఇస్తే వస్తే చాలు అనుకునే రకం కాదు, తనతో పాటు పెద్ద ప్యాకేజి నే కోరుకుంటారు అని ప్రచారం సాగుతోంది. చంద్రబాబుకి ఈ కీలక సమయంలో గంటా లాంటి వారి అవసరం చాలానే ఉంది. ఆయన అంగబలం, అర్ధం బలం కూడా పార్టీకి అవసరం. ఆ విధంగా చూసుకున్న‌పుడు గంటా అనుకున్న విధంగా పార్టీలో విలువ మర్యాద లభిస్తాయా అన్న చర్చ కూడా ఉంది.

బహుశా ఇలాంటి అంశాలన్నీ అధినాయకత్వంతో తేల్చుకున్నాకే గంటా పూర్తి యాక్టివ్ అవుతారు అని అంటున్నారు. ఇక ఆయన పార్టీ మీటింగుకు హాజరు కాకపోయినా అధినాయకత్వం ఏమీ గుస్సా అయిపోదూ, ఆయన మీద ఏమీ యాక్షన్ కూడా తీసుకోలేరు. అందువల్ల గంటా తనదైన శైలిలోనే టీడీపీలో తన మార్క్ చూపిస్తున్నారు అంటున్నారు. మరి గంటాతో గ్యాప్ హై కమాండ్ కి ఉంటే సెటిల్ చేసుకుంటారు. అలాగే గంటాని పిలిస్తే ఆయన వెళ్ళి క్లారిటీ తీసుకుని వస్తారు అని అంటున్నారు.

ఇక గంటాను ఈ మధ్య కాలంలో బాగా హర్ట్ చేసిన ఒక మాటను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. కొన్ని బురద పాములు మూడేళ్ళుగా సైలెంట్ అయి ఇపుడు బయటకు వస్తున్నాయని అయ్యన్న గంటా పేరు చెప్పకుండా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మరి దాని మీద హై కమాండ్ కూడా అయ్యన్నను ఏమీ అనకపోవడంతో కూడా గంటా వర్గం గుర్రుగా ఉంది అంటున్నారు. చూడాలి మరి గంటా ఏం చేసినా అర్ధం పరమార్ధం ఉంటుంది. అది అర్ధం కావాల్సిన వారికి కరెక్ట్ గానే అర్ధం అవుతుంది. అర్ధం కానిది మధ్యలోని వాళ్ళకే అంటున్నారు.