Begin typing your search above and press return to search.

బాబు అడుగు జాడల్లోనే...క్లారిటీ ఇచ్చేశారు...?

By:  Tupaki Desk   |   18 Jan 2022 11:31 AM GMT
బాబు అడుగు జాడల్లోనే...క్లారిటీ ఇచ్చేశారు...?
X
చంద్రబాబు నాయకత్వంలోనే అంతా అంటున్నారు. బాబు ఒక విజనరీ అని కూడా చెబుతున్నారు. చంద్రబాబు అడుగు జాడలలోనే తామంతా ముందుకు సాగుతామని చెప్పారు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. చాలా మందికి ఆయన పొలిటికల్ రూట్ మీద ఉన్న డౌట్లకు ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా పక్కాగా క్లారిటీ ఇచ్చేశారు అనుకోవాలి.

గంటా ఆ పార్టీలో చేరుతారు, ఈ పార్టీలో ఉంటారు అంటూ ఇప్పటిదాకా చాలా కధనాలు వచ్చాయి. ఇక ఆయన జనసేనలోకి వెళ్తారని కూడా తరచుగా వినిపించిన ప్రచారం. బాబుతో గ్యాప్ వచ్చింది అని కూడా అన్న వారూ ఉన్నారు. గంటా సైతం గత రెండున్నరేళ్ళుగా గుమ్మం కదలకపొవడంతో వాటికి ఒక అవకాశం ఏర్పడింది అనుకోవాలి.

ఇక ఈ మధ్యన గంటా కాపు నాయకుడే ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకున్నారు. ఇవన్నీ కూడా ఆయన చుట్టూ అతి పెద్ద చర్చను మొదలయ్యేలా చేశాయి. గంటా సైతం వాటిని ఖండించకపోవడంతో అదే నిజమని నమ్మే వారూ ఉన్నారు. దీంతో అన్నింటికీ ఒకే ఒక్క సమాధానం అన్నట్లుగా సరైన టైమ్ చూసి మరీ గంటా గట్టిగానే చెప్పేశారు. చంద్రబాబే మా మార్గదర్శి అని కూడా అనేశారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అడుగు జాడల్లోనే తామంతా నడుస్తామని కూడా గంటా అన్నారు. ఇక ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి పార్టీ వ్యూహాలు ఎలా ఉండాలి ఏంటి అన్నది పార్టీ అత్యున్నత కమిటీ నిర్ణయిస్తుందని గంటా చెప్పడం విశేషం. అంటే పొత్తులు ఎత్తులు లాంటివి అన్న మాట.

మరో వైపు విశ్వవిఖ్యాత సార్వభౌముడు ఎన్టీయార్ తెలుగు జాతికి వెలుగు అని గంటా కొనియాడారు. మహిళలకు అస్తిలో వాటాతో పాటు, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీయార్ దే అని అన్నారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లొ అధికారంలోకి రావడం ఒక్క ఎన్టీయార్ వల్లనే సాధ్యపడిందని కూడా గంటా పొగిడారు. తెలుగు కధను ప్రపంచానికి చాటిన ఘనుడు ఎన్టీయార్ ని కితాబు ఇచ్చారు.

మొత్తం మీద చూసుకుంటే గంటా పొలిటికల్ గా మళ్ళీ ఫుల్ గా రీచార్జి అవుతున్నారు. తెలుగుదేశం ద్వారానే తన పొలిటికల్ కెరీర్ ని కంటిన్యూ చేయాలని కూడా డిసైడ్ అయినట్లుగానే ఉన్నారు. మరి గంటా వంటి దిగ్గజ నేత కనుక టీడీపీలో ఉంటే ఆ పార్టీకి సగం బలమే అని చెప్పాలి.