Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్ర ఉఫ్.. బాబుకు భారీ షాక్?

By:  Tupaki Desk   |   28 Sept 2019 2:18 PM IST
ఉత్తరాంధ్ర ఉఫ్.. బాబుకు భారీ షాక్?
X
ఉత్తరాంధ్ర - గోదావరి జిల్లాలు టీడీపీకి ఒకప్పుడు కంచుకోటలు.. కానీ కాలం మారింది.. ప్రజలు మారారు. ఇక నేతల సంగతి వివరంగా చెప్పాలా.? వాళ్లు మారిపోతున్నారు. అధికారామనే బెల్లం దగ్గరకు ఈగల వలే చేరిపోతున్నారు.

ఏ పార్టీ నుంచి గెలిచినా చివరకు అధికార పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకునే ఉత్తరాంధ్ర బలమైన నాయకుడు - టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు గురి ఈసారి మాత్రం తప్పింది. 2009 తర్వాత ఫస్ట్ టైం ఆయన మంత్రి పదవికి దూరంగా ప్రతిపక్షంలో ఉన్నారు. దాన్ని జీర్నించుకోవడం లేదో ఏమో కానీ.. ఇప్పుడు చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఊహాగానాలకు తెరదించుతూ అధికార వైసీపీ పార్టీలో చేరేందుకు రెడీ అయినట్టు సమాచారం..

అయితే చంద్రబాబు లాగా పక్కపార్టీ వారిని నీతి నియమాలు లేకుండా లాగేసే రకం కాదు కదా వైసీపీ అధినేత జగన్. అందుకే గంటాను రాజీనామా చేయించే వైసీపీలోకి తీసుకోవడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.. ఈ మేరకు గంటాను చేర్చుకోవడానికి వైఎస్ జగన్ ఓకే అన్నారని.. వైసీపీలో చేరాక ఆయనకు దక్కే అవకాశాలపైనే ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని సమాచారం..

ఈమేరకు గంటాతోపాటు ఆయన సన్నిహితులు మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత - నాయుడు - టీడీపీలో ఉన్న మరో నేత కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యి హైదరాబాద్ పయనమైనట్టు తెలిసింది..

గంటా చేరికతో టీడీపీకి ఉత్తరాంధ్రలో షాక్ తగలడం గ్యారెంటీ అంటున్నారు. గంటాతోపాటు టీడీపీకి చెందిన బలమైన నేతలు విశాఖ రూరల్ జిల్లాకు చెందిన అడారి అజయ్ - మాజీ చైర్ పర్సన్ రమాకుమారి - మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు - మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు కూడా వైసీపీలో చేరడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విశాఖ పట్నం తోపాటు విజయనగరం టీడీపీ నేతలు కూడా గంటాతో వైసీపీ లో చేరితే టీడీపీ అధినేత చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ బలహీన పడడం ఖాయమంటున్నారు.