Begin typing your search above and press return to search.

టీడీపీ ఓట‌మిని గంటా ప‌సిగ‌ట్టేశారే!

By:  Tupaki Desk   |   18 Jun 2018 10:11 AM GMT
టీడీపీ ఓట‌మిని గంటా ప‌సిగ‌ట్టేశారే!
X
ఏపీలో అధికార పార్టీ టీడీపీలో ఇప్పుడు చాలా విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో ఇటు పాల‌న‌లోనే కాకుండా అటు అభివృద్ధి ప‌రంగానూ ఏమాత్రం ఆశించిన ఫ‌లితాలు సాధించ‌ని నేప‌థ్యంలో పార్టీపై జ‌నాల్లో వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్న విశ్లేష‌ణ‌లు ఇటీవ‌లి కాలంలో మ‌రింత‌గా పెరిగిపోయాయి. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో సంతృప్త స్థాయి విష‌యంలో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగానూ స‌ద‌రు విశ్లేష‌ణ‌లు చెబుతున్నాయి. నిత్యం టెలీ కాన్ఫ‌రెన్స్‌ ల‌తో కాలం వెళ్ల‌దీసే చంద్ర‌బాబు.... ఎప్పుడు చూసినా ప్ర‌జ‌ల్లో పార్టీ - ప్ర‌భుత్వం ప‌ట్ల సంతృప్త స్థాయినే ప్ర‌స్తావిస్తుండ‌టంతో పార్టీ శ్రేణులు కూడా అస‌హ‌నానికి గుర‌వుతున్నార‌న్న వార్త‌లు కూడా ఇటీవ‌లి కాలంలో అధికమ‌య్యాయి. అభివృద్ధి విష‌యంలో అంత‌గా ప‌ట్టుబ‌ట్ట‌ని సీఎం... కేవ‌లం ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో సంతృప్త స్థాయిని మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుని మాట్లాడితే ఏం స‌మాధానం చెబుతామంటూ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జీల‌తో పాటు ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు చివ‌ర‌కు మంత్రులు కూడా చిరాకు ప‌డుతున్నార‌ట‌.

అయితే ఇవేవీ ప‌ట్ట‌ని చంద్ర‌బాబు మాత్రం ప్ర‌భుత్వంతో పాటు పార్టీ ప‌ట్ల కూడా ప్ర‌జ‌ల్లో సంతృప్త స్థాయి పెరిగితేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం వ‌రిస్తుంద‌ని - వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం వ‌రించాలంటే ప్ర‌జ‌ల్లో సంతృప్త స్థాయిని మ‌రింత‌గా పెంచాల్సిందేన‌ని ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీలో నెల‌కొన్న అభ‌ద్ర‌తాభావం ఇప్పుడు బాగా కొట్టొచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి ప‌రాజయం త‌ప్ప‌ద‌న్న ఓ స్ప‌ష్ట‌మైన అంచనాకు వ‌చ్చిన చాలా మంది టీడీపీ నేత‌లు ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారంటూ ఇప్పుడు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే పార్టీలోని అంద‌రు నేత‌లూ ఒకేలా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు లేవు క‌దా. పార్టీకి ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్న భావ‌న వ‌చ్చినంత‌నే... బిగుసుకుపోయి మూల‌న కూర్చునే నేత‌లు కొందరుంటే... ఈ పార్టీ కాక‌పోతే... ఇక రాష్ట్రంలో పార్టీలే లేవా? అంటూ ఆలోచ‌న చేయ‌డంతో పాటు... గెలుపు అవ‌కాశాలున్న పార్టీల్లోకి జంప్ కొట్టేసే నేత‌లు కూడా ఉన్నారు.

మొద‌టి ర‌కం నేత‌లు చాలా మంది ఉంటే... రెండో ర‌కానికి చెందిన నేత‌లు మాత్రం చాలా త‌క్కువ‌గా ఉంటారు. ఇలాంటి రెండో ర‌కం నేత‌ల వ్య‌వ‌హారంతోనే ఆయా పార్టీల హావ‌భావాలు బ‌య‌ట‌ప‌డుతుంటాయి. ఇప్పుడు స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితే టీడీపీలో నెల‌కొంది. వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని - ప్ర‌జ‌ల్లో పార్టీ ప‌ట్ల అంత‌కంత‌కూ పెరుగుతున్న వ్య‌తిరేక‌తే కార‌ణ‌మ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ విశ్లేష‌ణ‌ల‌తో ఏకీభ‌విస్తున్న కొంద‌రు నేత‌లు ప్ర‌త్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్న నేత‌గా టీడీపీ నేత‌ - చంద్ర‌బాబు కేబినెట్ లో కీల‌క శాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీ‌నివాస‌రావు ఉన్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. పార్టీ ఏదైనా ఫ‌ర‌వా లేదు... సొంత ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే ముఖ్య‌మ‌న్న కోణంలో యోచించే గంటా... ఎన్నిసార్లు పార్టీ మారినా జ‌నం ఏమ‌నుకుంటార‌న్న విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోర‌న్న వాదన ఉంది. ఈ వాద‌న నిజ‌మేన‌న్న‌ట్లుగా గంటా వ్య‌వ‌హారం ఇప్పుడు ఆస‌క్తి రేపుతోంది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌న్న గ‌ట్టి న‌మ్మ‌కానికి వ‌చ్చేసిన గంటా... సేఫ్ మోడ్ లోకి వెళ్లేందుకు ఇప్ప‌టినుంచే పావులు క‌దుపుతున్నార‌ట‌. ఇందులో భాగంగా త‌న సామాజిక వ‌ర్గం కాపుల‌ను రంగంలోకి దించేసిన గంటా... జ‌న‌సేన లేదంటే వైసీపీలో చేరేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

మొన్నామధ్య ఇదే విష‌యాన్ని వైసీపీ కీల‌క నేత‌ - ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బ‌య‌ట‌పెడితే... అంతా అదో భోగ‌స్ అంటూ కొట్టిపారేశారు. అయితే విజ‌య‌ సాయిరెడ్డి చెప్పిన మాట‌ల్లో వాస్త‌వం ఉంద‌ని - గంటా ఇటు జ‌న‌సేన‌తో పాటు అటు వైసీపీ నేత‌ల‌తోనూ ట‌చ్‌ లో ఉన్నార‌ని తేలిపోయింది. ఇందుకు నిద‌ర్శ‌న‌మే నిన్న వెలువ‌డిన ఆర్జీస్ ఫ్లాష్ టీం - ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే ఫ‌లితాలు. స‌ర్వేలో టీడీపీ నేత‌లంతా బాగానే ప‌నిచేస్తున్నార‌ని చెప్పిన స‌ద‌రు స‌ర్వే... టీడీపీలో బ‌లమైన నేత‌గానే కాకుండా చంద్ర‌బాబు కేబినెట్ లో కీల‌క శాఖ మంత్రిగా ఉన్న గంటా ప‌నితీరు బాగా లేద‌ని - ప్ర‌జా వ్య‌తిరేక‌త క‌లిగిన టీడీపీ సిట్టింగుల్లో గంటాదే తొలి స్థాన‌మ‌న్న కోణంలో నివేదిక ఇచ్చింది. అయినా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌... చంద్ర‌బాబు లేదంటే నారా లోకేశ్ అనుమ‌తి లేనిదే... గంటాను నేరుగా టార్గెట్ చేసే అవ‌కాశాలు లేవు. అంటే... గంటా య‌త్నాల‌ను ప‌సిగ‌ట్టిన కార‌ణంగానే స‌ర్వేలో గంటా ప‌నితీరు బాగా లేద‌న్న రిపోర్టు ఇచ్చేసి... అదే రిపోర్టు కాపీని చూపి వ‌చ్చే ఎన్నికల్లో టికెట్ నిరాక‌రించ‌వ‌చ్చ‌న్న‌ది టీడీపీ భావ‌న‌గా అర్థ‌మవుతోంది. మొత్తంగా టీడీపీ ద‌క్కే ప‌రాజ‌యాన్ని ముందే ప‌సిగ‌ట్టి ప్ర‌త్యామ్నాయాల్లో గంటా మునిగిపోతే... గంటాకు షాకిచ్చేందుకు టీడీపీ కూడా త‌న‌దైన మార్గంలో వ్యూహం ర‌చించింద‌న్నమాట‌. అయితే చివ‌ర‌కు టీడీపీకి గంటా ముందుగా దెబ్బ కొడ‌తారా? లేదంటే గంటాకే టీడీపీ దెబ్బేస్తుందా? అన్న విష‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.