Begin typing your search above and press return to search.

విప‌క్షంలో ఉన్న‌ప్పుడే రాజీనామాలా..? వైసీపీ పై గంటా ఫైర్

By:  Tupaki Desk   |   10 March 2021 9:30 AM GMT
విప‌క్షంలో ఉన్న‌ప్పుడే రాజీనామాలా..? వైసీపీ పై గంటా ఫైర్
X
వైసీపీ నాయకులు విపక్షంలో ఉన్న‌ప్పుడే రాజీనామాల గురించి మాట్లాడుతారా? అధికార పక్షంలో ఉన్న‌ప్పుడు అవ‌స‌రం లేదంటారా? అని గంటా శ్రీనివాస‌రావు ప్ర‌శ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి, ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై వైసీపీ నేత‌లు స్పందిస్తూ... రాజీనామాల వ‌ల్ల ఉప‌యోగం లేద‌న్నారు. విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ‌కు ఉమ్మ‌డిగా పోరాటం సాగించాల‌ని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. దీనిపై గంటా స్పందించారు. విశాఖ‌లో కార్పొరేష‌న‌ల్ ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్‌ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు కేంద్రం దిగిరావాలంటే ఎంపీలంతా రాజీనామా చేయాల‌ని ప‌లుమార్లు అన్నార‌ని చెప్పారు.

కానీ.. ఇప్పుడు ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యానికి వ‌చ్చే స‌రికి రాజీనామాలు అవ‌స‌రం లేద‌ని అంటున్నార‌ని అన్నారు. వాళ్లిప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టే ఇలా మాట్లాడుతున్నార‌ని అన్నారు. రాష్ట్రంలోని నేత‌లు రాజ‌కీయాల‌కు అతీతంగా ఒక్క‌టి కావాల‌ని పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి అధికార పార్టీ నాయ‌క‌త్వం వ‌హించాల‌ని, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల‌ని, అప్పుడేకేంద్రం దిగివ‌స్తుంద‌ని అన్నారు గంటా.