Begin typing your search above and press return to search.

తన రాజకీయ భవిష్యత్ పై గంటా సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   12 Feb 2021 3:43 PM GMT
తన రాజకీయ భవిష్యత్ పై గంటా సంచలన ప్రకటన
X
ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర సీనియర్ గంటా శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకకు నిరసనగా రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు ఉద్యమాన్ని మరింత రగిలించారు. కానీ ఆయనది ఫేక్ రాజీనామా అని కొందరు అంటుండడంతో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పంపించారు.

తాజాగా ఓ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన గంటా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసిన తాను మళ్లీ విశాఖ ఎమ్మెల్యేగా పోటీచేయనని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ బాధితుల్లో ఒకరిని ఉప ఎన్నికల్లో బరిలో దించుతానని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తున్న వ్యక్తిని ఎంపిక చేసి ఉమ్మడి అభ్యర్థిగా నిలబెడుతామన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ను కోరారు. టీడీపీలోనే ఉంటాను.. టీడీపీతోనే ఉంటానంటూ గంటా సంచలన కామెంట్స్ చేశారు.

విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌ను ఒక పరిశ్రమగా చూడొద్దని.. అది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందని గంటా చెప్పుకొచ్చారు. విశాఖతో తనకు ఎంతో అనుబంధం ఉందని.. రాజీనామా తన వ్యక్తిగత నిర్ణయమన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలో కలవాలని గంటా కోరారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్దమన్నారు. అందరూ కలిసి ఉద్యమం చేస్తే.. కేంద్రం వెనక్కి తగ్గుతుందని పిలుపునిచ్చారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తూ కేంద్రంలోని బీజేపీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో ఉద్యమం సాగుతోంది. దీనికి నిరసనగా ఏపీ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏకంగా రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాజకీయాల్లో తాజా చర్చకు ఆయన కేంద్రబిందువయ్యారు.