Begin typing your search above and press return to search.

వంశీ గన్నవరానికి వైసీపీ ప్రత్యర్ధుల చెక్

By:  Tupaki Desk   |   15 Jan 2023 11:30 PM GMT
వంశీ గన్నవరానికి వైసీపీ ప్రత్యర్ధుల చెక్
X
వల్లభనేని వంశీ. కరడుకట్టిన తెలుగుదేశం నాయకుడు. 2019లో తొలిసారిగా విజాయవాడ ఎంపీ సీటుకు పోటీ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా వంశీ తెలుగుదేశం అధినాయకత్వానికి బాగా దగ్గర అయ్యారు. ఫలితంగా 2014లో గన్నవరం టికెట్ దక్కింది. తొలిసారి మంచి ఊపు మీద గెలిచారు. ఇక 2019లో చూసుకుంటే వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ గెలుపు జెండా ఎగరేశారు. అలాంటి వంశీ ఏడాది అయినా తిరగకుండా వైసీపీ నీడన చేరారు.

నిత్యం చంద్రబాబు లోకేష్ లను విమర్శిస్తూ వారి వ్యక్తిగత జీవితంలోకి కూడా చొచ్చుకుపోయేలా విమర్శలు చేస్తూ వచ్చిన వంశీ టీడీపీలోకి ఇక వెళ్లరు అనే పరిస్థితిని తెచ్చుకున్నారు. అయితే జగన్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయనకు 2024లో గన్నవరం టికెట్ ఖరార్ చేశారు. అంతవరకూ బాగానే ఉంది అనుకున్నా గన్నవరంలో పాతకాపులు అయిన వైసీపీ నేతలతోనే వంశీకి తలనొప్పులు వస్తున్నాయి.

వంశీ రెండుసార్లు గన్నవరంలో గెలిస్తే ఆయన మీద వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రత్యర్ధులుగా యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు ఉన్నారు. ఈ ఇద్దరూ వైసీపీ ఆరంభం నుంచి ఉన్న నాయకులు. నిజానికి వంశీ వైసీపీలోకి రానంతవరకూ ఈ ఇద్దరికీ పడేది కాదు. కానీ ఎపుడైతే వంశీ వచ్చారో నాటి నుంచి ఈ ఇద్దరూ ఒక్కటై వంశీకి వ్యతిరేకంగా రాజకీయం నడుపుతున్నారు.

ఈ ఇద్దరు నేతలు సంక్రాంతి పండుగ శుభవేళ మంచి ముహూర్తాన్ని ఎంచుకుని మరీ వంశీకి గట్టిగా చెక్ పెట్టే పాలిటిక్స్ కి తెర తీశారు. వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇస్తే సహకరించేది లేదని ఇప్పటికే ఈ ఇద్దరు నాయకులూ అధినాయకత్వానికి స్పష్టం చేసినట్లుగా చెబుతునారు. కానీ హై కమాండ్ మాత్రం వంశీకే టికెట్ అని ప్రకటించేసింది. దాంతో ఇక చేసేది ఒక్కటే. పార్టీలో కంటిన్యూ కావడం, లేదా వేరే పార్టీలోకి వెళ్ళడం. పోనీ తెలుగుదేశంలోకి వెళ్దామా అంటే అక్కడ గద్దె రామ్మోహన్ కి గన్నవరం టికెట్ కన్ ఫర్మ్ చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది.

ఈ నేపధ్యంలో ఈ ఇద్దరు నేతలు తాజాగా భేటె కావడం రాజకీయంగా ఆసక్తిని రేపుతున్న చర్చగా ఉంది. ఈ ఇద్దరు నేతలూ వంశీకి యాంటీగా గన్నవరం రాజకీయాన్ని గరం గరం చేయడానికే కలిశారు అని అంటున్నారు. ఇక యార్లగడ్డ వెంకటరావు అయితే వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి డిసైడ్ అయ్యారని అంటున్నారు. దానికి మరో నేత దుట్టా రామచంద్రరావు ఫుల్ సపోర్ట్ ఇస్తారని తెలుస్తోంది.

మరి ఇది యార్లగడ్డ, దుట్టాల సొంత వ్యూహమా లేక దీని వెనకాల తెలుగుదేశం పాత్ర ఏమైనా ఉందా అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికిపుడు తెలుగుదేశంలోకి వెళ్ళినా టికెట్ అయితే దక్కదు. అందుకే వేరుగా పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి వంశీని ఓడించి ఆ మేరకు తెలుగుదేశానికి లాభం కలిగిస్తే తెలుగుదేశం అధికారంలోకి ఒకవేళ వస్తే అపుడు ఈ ఇద్దరు నాయకులకు మేలు చేసేలా ఏమైనా హామీ ఇచ్చారేమో అని అంటున్నారు.

ఈ రోజు దాకా వైసీపీలో ఉన్న యార్లగడ్డ, దుట్టాలకు సొంత ఫాలోయింగ్ ఉంది. ఇండిపెండెంట్ గా యార్లగడ్డ పోటీ చేస్తే ఓట్ల చీలిక జరిగి వైసీపీకి నష్టం సంభవించవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా వంశీని ఓడిస్తామని ఈ ఇద్దరు నేతలు అంటున్నారు. మరి రాజకీయాల్లో పండిపోయిన వల్లభనేని వంశీ తన కొత్త ప్లాన్ ఏంటో బయటపెడతారు అని కూడా అంటున్నారు.