Begin typing your search above and press return to search.

నయీం పెట్టుకున్న ముద్దుపేర్లు చూశారా?

By:  Tupaki Desk   |   16 Aug 2016 4:27 AM GMT
నయీం పెట్టుకున్న ముద్దుపేర్లు చూశారా?
X
తీగ లాగుతున్న కొద్దీ డొంక క‌దులుతోంది. నయీం ఎన్‌ కౌంట‌ర్ త‌రువాత రోజుకో విష‌యం బ‌య‌టకి వ‌స్తోంది. కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు - పోలీసు అధికారుల‌తోపాటు వ్యాపార‌వేత్త‌ల‌తో కూడా న‌యీముద్దీన్‌ కు ఉన్న సంబంధాలపై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించార‌ని తెలుస్తోంది. ఒక‌ప్పుడు పోలీసుల‌కు ఇన్ఫార్మ‌రుగా ఉంటూ, మావోయిస్టుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని అందించే క్ర‌మంలో కొంత‌మంది ఉన్న‌తాధికారుల‌కు న‌యీం ద‌గ్గ‌ర‌య్యాడు. త‌రువాత‌ - ఆ చ‌నువుతోనే త‌మ సొంత ప‌నుల‌కు కూడా నయీంను చాలామంది వాడుకున్న‌ట్టు తెలుస్తోంది. నయీం ఆగ‌డాలు తెలుస్తూ ఉన్నా - చూసీచూడ‌న‌ట్టుగా కొంత‌మంది అధికారులు వ్య‌వ‌హ‌రించార‌ని అనుమానిస్తున్నారు! అయితే, హైద‌రాబాద్‌ లోని పుప్పాల గూడ ప్రాంతంలో ఉన్న నయీం ఇంటిలో సోదాలు చేసిన పోలీసుల‌కు డైరీతోపాటు ఒక ఫొటో ఆల్బ‌మ్ కూడా దొరికిన సంగ‌తి తెలిసిందే. ఈ డైరీలో ఎవ‌రెవ‌రికి ఏ స్థాయి బ‌హుమ‌తులు ఇచ్చాడ‌నే విష‌యం న‌యీం రాసుకున్నాడ‌న్న వార్త‌లు గ‌డ‌చిన రెండుమూడు రోజుల్లో సంచ‌ల‌నం రేకెత్తించాయి. తాజాగా, న‌యీం రాత‌ల‌ను డీ కోడ్ చేసే ప్ర‌య‌త్నంలో పోలీసులు వ‌ర్గాలు ఉన్న‌ట్టు స‌మాచారం.

న‌యీం త‌న డైరీలో కోడ్ లాంగ్వేజ్‌ లో కొన్ని ప‌దాలూ - వ్య‌క్తుల పేర్లు రాసుకున్నాడ‌ట‌. త‌నతో డీల్ చేసిన ప్ర‌తీ వ్య‌క్తికీ మారుపెట్టి - ఆ పేరుతోనే వివ‌రాల‌ను నోట్ చేసుకున్నాడ‌ట‌! కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు - పోలీసు అధికారులు - వ్యాపార‌వేత్త‌ల వివ‌రాలు మారు పేర్ల‌తో డైరీలో ఉన్నాయ‌ని చెబుతున్నారు! ఈ పేర్ల‌లో ఇద్ద‌రు వ్య‌క్తుల ప్ర‌స్థావ‌న ఎక్కువ‌సార్లు డైరీలో ఉంద‌ని స‌మాచారం. చింటూ సార్‌ - టెర్ర‌ర్ బాస్‌... వీరిద్ద‌రూ ఎవ‌రోగానీ - వీరితోనే న‌యీం అత్యంత స‌న్నిహితంగా మెలుగుతూ వ‌చ్చాడ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా అనుమానిస్తున్నారు. వీరు క‌చ్చితంగా పోలీసు అధికారులే అయ్యుంటార‌ని కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వీరిద్ద‌రిలో చింటూ సార్ అంటే న‌యీంకు ఇంకా అభిమానం ఎక్కువ‌నీ, ఆయ‌న‌తోనే ఎక్కువ‌గా డీల్ చేసిన‌ట్టున్నాడ‌ని అంటున్నారు. అంతేకాదు, విలువైన బ‌హుమతులు కూడా చింటూ సార్‌ కే ఎక్కువ‌గా ఇచ్చిన‌ట్టు డైరీలో ఉంద‌ని అధికారులు చెప్తున్నారు. ఇంత‌కీ, ఈ ఇద్ద‌రు సార్లు ఎవ‌రు.. అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా మారింది. పోలీసుల అధికారుల‌కు స‌వాలుగా మారింది.