Begin typing your search above and press return to search.

వేషం మార్చి.. పండ్లు అమ్ముకుంటున్న గ్యాంగ్ స్టర్ అరెస్టు

By:  Tupaki Desk   |   8 Sep 2020 12:30 AM GMT
వేషం మార్చి.. పండ్లు అమ్ముకుంటున్న గ్యాంగ్ స్టర్ అరెస్టు
X
అతడో కరడు గట్టిన నేరగాడు. అతడు చేయని నేరమంటూ లేదు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్ లు లెక్క లేనన్ని చేశాడు. 51 కేసుల్లో నిందితుడు అతడు. ఈ గ్యాంగ్ స్టర్ పోలీసులకు దొరక్కుండా మారువేషాలతో తిరుగుతూ వచ్చాడు. చివరికి తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన ఆషు జాట్ అంటే అందరికీ హడల్. అంతటి క్రిమినల్ అతడు. 32ఏళ్లకే ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డాడు.అతడి గ్యాంగ్ లో 25 మంది నేరగాళ్లు ఉన్నారు. ఈ ముఠా కళ్లలో కారంకొట్టి దోపిడీలకు పాల్పడుతుంటుంది. అందుకే వీరిని మిర్చీ గ్యాంగ్ అని పిలిచేవారు. ఓ ప్రముఖ బీజేపీ నాయకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు గానూ ఉన్నాడు. నోయిడాకు చెందిన ఎగ్జిక్యూటివ్ గౌరవ్ చందేల్ ను జనవరి 7న హత్య చేశాడు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అతడి భార్య పూనం తో పాటు మరికొందరు సభ్యులను కూడా అరెస్టు చేశారు. కానీ జాట్ మాత్రం తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరికి అతడిని ఎన్కౌంటర్ చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.

ఓ హెల్త్ కేర్ కంపెనీ రీజినల్ మేనేజర్ హత్య కేసులో యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు జాట్ ను ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నట్లు అతడికి సమాచారం అందింది. దీంతో అతడు ముంబై పారిపోయాడు. అక్కడ అతడు వేషం మార్చి కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి పండ్లు అమ్ముకునే వాడిలా మారిపోయాడు. చివరికి అతడు ముంబై పారిపోయినట్లు పోలీసులు తెలుసుకొని అక్కడ అతడి కోసం గాలింపులు మొదలుపెట్టారు. అక్కడ జాట్ కోసం రోజుల తరబడి తిరిగారు. జాట్ వేషం మార్చి పండ్లు అమ్ముకుంటున్నట్లు గుర్తించారు. కానీ అతడి పోలికలు మారిపోవడంతో అతడా..కాదా అని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. చివరికి జాట్ అతడి స్నేహితులకు కాల్స్ చేస్తుండటంతో నిర్ధారించుకుని అరెస్టు చేశారు.