Begin typing your search above and press return to search.

ట్యాంక్ బండ్ పై గ్యాంగ్ వార్!!

By:  Tupaki Desk   |   1 Sept 2020 9:15 AM IST
ట్యాంక్ బండ్ పై గ్యాంగ్ వార్!!
X
హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ వద్ద గణేష్‌ నిమజ్జనం సందర్భంగా చెలరేగిన చిన్నపాటి గొడవ రాజుకుంది. బైక్ పై వేగంగా వెళ్తున్న వారిని స్లోగా వెళ్లాలని మందలించినందుకు ప్రారంభమైన గొడవ పెద్దదిగా మారి ఒకరినొకరు కొట్టుకునే దాకా వెళ్లింది. ఆ సమయంలో చెలరేగిన హింసాకాండలో టాటా సఫారీ కారుతో పాటు పక్కనే ఉన్న బస్టాప్‌ అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. రౌడీ గ్యాంగ్ లా యువకులు ఒకరి నొకరు కొట్టుకోవడంతో అసలేం జరుగుతుందో తెలియక నిమజ్జనానికి వచ్చిన భక్తులు భయపడిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు.

పార్సిగుట్ట జెమిస్తాన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన అరుణ్‌ (27), సాయికుమార్‌ (28), సంతోష్‌ (22), మల్లికార్జున్‌ (27) స్నేహితులు. వీరు చవితి వేడుకల సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి టాటా సఫారీ కారులో విగ్రహాన్ని నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌ వద్దకు తీసుకొచ్చారు. 3.30 గంటల సమయంలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం పూర్తి చేసుకుని అదే కారులో తిరిగి ఇంటికి బయలుదేరారు.

ట్యాంక్‌బండ్‌ చిల్డ్రన్స్‌ పార్కు వద్దకు రాగానే వెనుక నుంచి ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు అతివేగంగా వచ్చారు. కారులో ప్రయాణిస్తున్న అరుణ్‌ వారిని నెమ్మదిగా వెళ్లాలని మందలించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ముగ్గురు యువకులు కారులో ప్రయాణిస్తున్న వారితో గొడవకు దిగారు. అక్కడే ఉన్న తమ స్నేహితులు కొందరిని రప్పించి కారులోని వారిని చితకబాదారు. దీంతో కారు లోని సాయికుమార్‌, సంతోష్‌లకు గాయాలయ్యాయి.
గొడవ జరిగే సమయంలోనే బాధితుల కారులో మంటలు చెలరేగాయి. అయితే యువకులు కావాలని చేశారా.. లేక ప్రమాదమా అన్నది తెలియాల్సి ఉంది.

కారులో చెలరేగిన మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఆర్టీసీ బస్టాప్‌ దహనమైంది. బాధితుడు అరుణ్‌ గాంధీనగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌ గాంధీనగర్‌ పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి వారి వద్ద వివరాలు సేకరించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గొడవ సందర్భంగా ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడం, పక్కనే ఉన్న బస్టాప్‌ పూర్తిగా కాలిపోవడంతో నిమజ్జన వేడుకలకు వచ్చిన ప్రజలు పరుగులు తీశారు. గంటపాటు గొడవ జరిగినా పోలీసులు రాకపోవడంతో ఏం జరుగుతుందో తేలిక ప్రజలు ఆందోళన చెందారు.