Begin typing your search above and press return to search.

కాక రేపుతున్న ఆ గ్యాంగ్ రేప్ నిందితుల విడుద‌ల‌.. సుప్రీంకోర్టుకు వివాదం!

By:  Tupaki Desk   |   23 Aug 2022 1:30 PM GMT
కాక రేపుతున్న ఆ గ్యాంగ్ రేప్ నిందితుల విడుద‌ల‌.. సుప్రీంకోర్టుకు వివాదం!
X
2002లో గుజ‌రాత్‌లో చోటు చేసుకున్న గోద్రా రైలు ద‌గ్ధం.. ఆ త‌ర్వాత చోటు చేసుకున్న అల్ల‌ర్లు అనేక దారుణాల‌కు దారితీసిన సంగ‌తి తెలిసిందే. రైలు ద‌హ‌నం అనంత‌రం గుజ‌రాత్‌లో ముష్క‌ర మూక‌లు ఓ వ‌ర్గంపై దాడుల‌కు దిగాయి. ఈ క్ర‌మంలో బిల్కిస్ బానో అనే మ‌హిళ‌పై 11 మంది అత్యాచారం చేశారు. అప్ప‌టికి ఆమె ఐదు నెల‌ల గ‌ర్భిణి. అంతేకాకుండా బిల్కిస్ బానో కుటుంబంలో మూడేళ్ల చిన్నారితో పాటు మొత్తం ఏడుగురిని ముష్క‌రులు హ‌త్య చేశారు. ఈ వ్య‌వ‌హారంలో 11 మంది దోషుల‌కు ఆ త‌ర్వాత జీవిత ఖైదు ప‌డింది.

బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో దోషులైన 11 మంది రాధేశ్యామ్ షా, జశ్వంత్ చతుర్‌ భాయ్, కేశూభాయ్ వడానియా, బాకాభాయ్ వడానియా, రాజీభాయ్ సోని, రమేష్‌భాయ్ చౌహాన్, శైలేష్ భట్, బిపిన్ చంద్ర జోషి, గోవింద్‌భాయ్, మహేష్ భట్, ప్రదీప్ మోధియాకు 2008 జనవరి 21వ తేదీన సీబీఐ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. బాంబే హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. అయితే గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం వారిని సత్ప్రవర్తన గల ఖైదీలుగా గుర్తించి ఆగ‌స్టు 15న విడుదల చేసింది. ఈ క్ర‌మంలో జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చిన నిందితుల‌కు స్వాగ‌త స‌త్కారాలు, మిఠాయిలు తినిపించ‌డం వంటివి జ‌రిగాయి.

దీంతో ఈ వ్య‌వ‌హారం దేశవ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. వేలాది మంది విశ్రాంత న్యాయ‌మూర్తులు, అఖిల భార‌త స‌ర్వీస్ అధికారులు, జ‌ర్న‌లిస్టులు, మాన‌వ హ‌క్కుల సంఘాల ప్ర‌తినిధులు, చ‌రిత్ర‌కారులు, సినీ రంగానికి చెందిన‌వారు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఒక కుటుంబంలో చిన్న పిల్ల‌తో స‌హా ఏడుగురిని హ‌త్య చేసి ఐదు నెల‌ల గ‌ర్భిణిపై అత్యాచారం చేసిన 11 మంది నిందితుల‌ను విడిచిపెట్ట‌డం అత్యంత దారుణ‌మ‌ని మండిప‌డ్డారు. ఈ వ్య‌వ‌హారంపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏకంగా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి వారంతా విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ‌లో ఐఏఎస్ అధికారిణి స్మితా స‌బ‌ర్వాల్ వంటి వారు సోష‌ల్ మీడియాలో నిందితుల విడుద‌లను ఖండిస్తూ పెద్ద ఉద్య‌మ‌మే న‌డిపారు.

బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆమె కుటుంబంలో ఏడుగురిని హ‌త్య చేసిన‌వారిని ఎలా విడిచిపెడ‌తారంటూ మండిప‌డుతున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జోక్యం చేసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను అడ్రస్ చేస్తూ జాయింట్ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.

ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారాన్ని ఆగ‌స్టు 23న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ‌వాది అపర్ణ భట్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ రమణ దృష్టికి తెచ్చారు. అత్యవసరంగా దీన్ని విచారించాలని విన్న‌వించారు. రేప్ కేసు నిందితుల విడుద‌ల ద్వారా మానవ హక్కులతో పాటు సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన మార్గదర్శకాలు కూడా ఉల్లంఘనకు గురయ్యాయని అత్యున్న‌త న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీనిపై ఎన్వీ ర‌మ‌ణ విచార‌ణ‌కు స్వీక‌రించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ్డారో, లేదో విచారిస్తాన‌ని తెలిపారు.