Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో నిమజ్జనం కొనసా..గుతోంది

By:  Tupaki Desk   |   28 Sep 2015 4:52 AM GMT
హైదరాబాద్ లో నిమజ్జనం కొనసా..గుతోంది
X
వినాయక నిమజ్జనం కొనసా...గుతోంది. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాధుల్ని ఎవరికి వారు వారి శక్తి మేరకు పూజించి.. నిమజ్జనం చేయటం తెలిసిందే. నిమజ్జనం రోజున భారీగా రద్దీ ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు.. తమకు నచ్చిన రోజుల్లో నిమజ్జనం చేయటం ఒక అలవాటుగా మారింది. దీనికితోడు.. స్థానికంగా ఉండే చెరువుల్లో విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసులు పక్కాగా నిర్వహిస్తుండటంతో.. ఒకప్పటి మాదిరిలా కాకుండా.. నిమజ్జనం తొందరగా పూర్తయ్యే పరిస్థితి.

ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి నిమజ్జన శోభా యాత్ర స్టార్ట్ అయినా.. ఈ రోజు (సోమవారం) కూడా కొనసాగుతోంది. గతంలో ఏ రోజు అయితే నిమజ్జనం అనుకుంటారో.. ఆ అర్థరాత్రి వేళకు కానీ.. లేదంటే పక్కరోజు ఉదయానికి నిమజ్జనం దాదాపుగా పూర్తి చేసే పరిస్థితి.

అందుకు భిన్నంగా ఈ ఏడాది సోమవారం ఉదయం 9.30 గంటల సమయానికి కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు నిమజ్జనం కోసం ఎదురు చూస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలకు వెళ్లాలని భావించే వారు.. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా ప్లాన్ చేసుకోవటం మంచింది.

బాలాపూర్.. చార్మినార్.. దిల్ సుఖ్ నగర్.. మలక్ పేట.. తదితర ప్రాంతాల నుంచి మొదలైన శోభాయాత్ర హస్సేన్ సాగర్ వైపు తరలటంతో.. భక్తుల రద్దీతో పాటు.. నిమజ్జన వాహనాలు భారీగా ఆ ప్రాంతంలో ఉన్నాయి. దీంతో.. ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారింది. సోమవారం.. పనుల కోసం పరుగులు పెట్టేవారు.. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్లాన్ చేసుకోవటం మంచిది. లేని పక్షంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే ప్రమాదం పొంచి ఉంది సుమా.