Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు హ్యాండిచ్చి కారెక్కుతున్న ఆ ఇద్దరు..

By:  Tupaki Desk   |   4 Jan 2019 4:13 AM GMT
కాంగ్రెస్ కు హ్యాండిచ్చి కారెక్కుతున్న ఆ ఇద్దరు..
X
తెలంగాణ కాంగ్రెస్ లో అనుమానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఎవరెప్పుడు పార్టీ గోడ దూకుతారోననే వార్తలు జోరందుకున్నాయి. రోజుకో పేరు తెరపైకి వస్తుండడంతో అధిష్టానం - పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి ఈ పేర్లు ఎలా ప్రచారంలోకి వస్తున్నాయనే దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవడం - తెలంగాణ కేబినెట్ ఏర్పాటు కాకపోవడం వంటి పరిణామాలు కూడా ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అధికార పార్టీలో ఉంటేనే మనుగడ అన్న ఆశ చూపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం తాజాగా తెరపైకి వస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అనూహ్య విజయం సాధించి 88 స్థానాలను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 19 నియోజకవర్గాల్లో గెలుపొందింది. గెలిచిన నేతలు ఎమ్మెల్యేలయ్యారు. ఓడిన నేతలు ఓటమి భారం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపై వ్యక్తమవుతున్న అనుమానాలతో పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. వీరిలో కాంగ్రెస్ లో ఉండేదెవరు..? అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరేదెవరు..? అనే అంశంపై చర్చ జోరందుకుంది. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. రోజుకో ఎమ్మెల్యే పేరు తెరపైకి వస్తోంది.

తాజాగా కాంగ్రెస్ ను వీడే ఎమ్మెల్యేల జాబితాలో మాజీ పౌరసరఫరాల శాఖమంత్రి - మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు - కాంగ్రెస్ సీనియర్ భూపల్లి పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కాంగ్రెస్ లో సీనియర్లే.. కానీ భూపాల పల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లిన సీఎం కేసీఆర్ ను వారిద్దరు కలిశారు. సహజంగా సీఎం తమ జిల్లాకు వస్తే ఏ పార్టీ ఎమ్మెల్యేలైన వెళ్లి కలవడం ఆనవాయితీ. ఈ ప్రక్రియలో భాగంగానే మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు - భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. దీంతో వీళ్లు పార్టీ మారుతారని ప్రచారం మొదలైంది.

ఇలా ప్రతీ విషయంలోనూ ఎమ్మెల్యేలను అనుమానపు చూపులు వెంటాడుతున్నాయి. మరోవైపు అజారుద్దీన్ కూడా పార్టీ ఫిరాయిస్తారని ప్రచారం జోరందుకుంది. ఆయన ఇటీవల ఎంపీ అసదుద్దీన్ కూతురు వివాహానికి హాజరయ్యారు. పెళ్లిలో టీఆర్ ఎస్ ఎంపీతో సీరియస్ గా చర్చలు జరిపారు. దీంతో అనుమానాలకు బలం చేకూరింది. అయితే తాను పార్టీ మారడం లేదని అజారుద్దీన్ క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి నిశబ్ధమయ్యారు. సీఎల్పీ సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ సీటు ఇవ్వకుంటే తనదారి తాను చూసుకుంటానన్నట్లు సమాచారం. ఈ విషయంలో అధిష్టానం నుంచి స్పందన రాకపోవడంతో ఆమె అంటీముట్టన్నట్లుగా ఉంటున్నారట.

మొత్తానికి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలపై రోజుకో రూమర్ బయటకు వస్తోంది. రేపోమాపో పార్టీ మారిపోతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం - కేసీఆర్ కేబినెట్ ఏర్పడితే ఎవరు పార్టీ మారుతారో..ఎవరు పార్టీలో ఉంటారో తేలిపోతుందని గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.