Begin typing your search above and press return to search.

గాంధీ విగ్రహం ప్లేసులో ఎన్టీఆర్ విగ్రహం

By:  Tupaki Desk   |   3 Aug 2016 4:00 AM GMT
గాంధీ విగ్రహం ప్లేసులో ఎన్టీఆర్ విగ్రహం
X
నవ్యాంధ్రలో విగ్రహాల తొలగింపు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలయాల తొలగింపుతో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న చంద్రబాబు ప్రభుత్వం ఆ తరువాత విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించి తీవ్ర విమర్శలకు గురయింది. రోడ్లు ఉన్నది జనం నడవడానికే తప్ప విగ్రహాలకోసం కాదని, విగ్రహాలు పెట్టుకోదలిస్తే ఇళ్ళల్లో పెట్టుకోమని చంద్రబాబు రెండు రోజుల కిందట వ్యాఖ్యానించారు. పదిహేను రోజుల కిందట అమరావతిలో భారత జాతిపిత మహాత్మాగాంధీ - అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని తొలగించారు. అంతవరకు బాగానే ఉన్నా తాజాగా సోమవారం టీడీపీ నాయకులు ఆ స్థానంలో ఎన్టీరామారావు విగ్రహాన్ని ప్రతిష్టించడం చర్చనీయమవుతోంది.

విగ్రహాలను రోడ్లకు అడ్డంగా ఉన్నాయని తొలగిస్తున్నారా లేదంటే వాటి స్థానంలో ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టడానికే తొలగిస్తున్నారా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను తొలగించినచోట టీడీపీ నేతలు దిమ్మె కట్టిస్తున్నప్పుడే ప్రతిపక్షాలు అధికారులకు ఫిర్యాదు చేశాయి. కానీ అధికారులు ఏం చేయలేకపోయారు. చంద్రబాబునే కాదు టీడీపీ నేతలను కూడా ఏమీ అనలేని పరిస్థితిలో జరుగుతున్నది మౌనంగా చూశారు అధికారులు. దాంతో గాంధీ విగ్రహాన్ని తొలగించి పదిహేను రోజుల్లోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టేశారు టీడీపీ నేతలు.

దీంతో విజయవాడలో వైఎస్‌ ఆర్‌ విగ్రహాన్ని తొలగించినచోట త్వరలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వినిపిస్తోంది. టీడీపీ శ్రేణులు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం వస్తుందని అంటున్నారు. రోడ్లకు అడ్డంగా ఉన్న విగ్రహాలను తొలగించి ప్రజలకు సౌకర్యం తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు ఇలా తమ పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటూ పోతే అర్థమేముంటుందని విపక్షాలు అంటున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పార్టీలు ఈ విగ్రహాలను తొలగించి మళ్లీ తమ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయరన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇలా ఒకరి తరువాత విగ్రహాలు కూల్చడం.. తమకు నచ్చినవారిని ప్రతిష్ఠించుకుంటూ పోతుంటే ప్రజాధనం వృథా కావడం తప్ప ఇంకే ప్రయోజనం ఉండదు.