Begin typing your search above and press return to search.

కొత్త ట్విస్టు: మీడియాలో వచ్చినట్లు గాంధీలో గ్యాంగ్ రేప్ జరగలేదట

By:  Tupaki Desk   |   19 Aug 2021 9:04 AM IST
కొత్త ట్విస్టు: మీడియాలో వచ్చినట్లు గాంధీలో గ్యాంగ్ రేప్ జరగలేదట
X
మూడు.. నాలుగు రోజుల నుంచి గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా వస్తున్న వార్తల గురించి తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతం పెను కలకలాన్ని రేపటమే కాదు.. హైదరాబాద్ పోలీసులకు సవాలుగా మారింది. అక్కాచెల్లెళ్లు ఇద్దరు గాంధీలో చికిత్స పొందుతున్న పేషెంట్ గా అటెండర్లుగా ఉండటం.. వారిలో ఒకరిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు.. మరొకరు కనిపించకుండా పోవటం తెలిసిందే. ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది.

నాటకీయ పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి.. ఈ కేసును ఛేదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాని పరిస్థితి. అన్నింటికి మించిన మిస్ అయిన మహిళ జాడ ఇప్పటివరకు దొరక్కపోవటం.. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా ఫిర్యాదు చేసిన మహిళ చెబుతున్న వివరాలు తికమక పెట్టేలా ఉండటం పోలీసులకు ఇబ్బందికరంగామారింది.

ఇలాంటి వేళ.. తాజాగా ఈ కేసుకు సంబంధించిన కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటివరకు ప్రచారం జరిగినట్లుగా గ్యాంగ్ రేప్ జరగలేదన్న విషయాన్ని పోలీసులు తేల్చినట్లుగా తెలుస్తోంది. బాధితురాలు చెప్పినట్లుగా నలుగురైదుగురు తనపై అత్యాచారం చేశారని.. తనకు మత్తు ఇచ్చి దారుణానికి పాల్పడినట్లుగా చెప్పిన నేపథ్యంలో.. పోలీసులు ఆ దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.

అదే సమయంలో బాధితురాలి ఫిర్యాదుతో ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాధితురాలి రక్త నమూనాలతో పాటు.. ఘటనాస్థలంలో లభ్యమైన వస్తువులను పరిశీలించేందుకు పంపగా.. ఆమెపై గ్యాంగ్ రేప్ జరగలేదని తేల్చారు. కాకుంటే.. అత్యాచారం జరగలేదని కూడా తాము చెప్పలేమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పోలీసులకు అందిన వైద్య నివేదికలో గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా ఆనవాళ్లు లేదని పేర్కొన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. మిస్ అయిన మహిళ ఆచూకీని పోలీసులు దాదాపుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆమె ఆచూకీ కోసం వందల సీసీ కెమేరాల ఫుటేజీని విశ్లేషిస్తున్న పోలీసులకు కీలక ఆధారం లభించిందని.. ఆమె ముషీరాబాద్ వైపు వెళుతున్నట్లుగా సీసీ పుటేజ్ లో ఆధారం లభించినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆమె ఆచూకీ దొరకబుచ్చుకునేందుకు ఒక ప్రత్యేక పోలీసుల టీంను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆమెను పోలీసులు గుర్తించే అవకాశం ఉందంటున్నారు. ఈ కేసు మిస్టరీ ఈ రోజు (గురు).. రేపు (శుక్ర) లో తేలే అవకాశం ఉందంటున్నారు.