Begin typing your search above and press return to search.

తెలంగాణలో తొలి బాధితుడ్ని అలా నయం చేశారట!

By:  Tupaki Desk   |   22 March 2020 6:05 AM GMT
తెలంగాణలో తొలి బాధితుడ్ని అలా నయం చేశారట!
X
కరోనాకు చికిత్స లేదు. ఆ వైరస్ సోకితే.. దాన్ని అధిగమించేందుకు కచ్ఛితమైన మందులు లేవు. వ్యాక్సిన్ అసలే లేదు. మరి.. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో కరోనా తొలి బాధితుడ్ని ఎలా ట్రీట్ చేశారు? ఏ చికిత్స చేసి.. అతగాడిని వైరస్ బారి నుంచి బయటపడేలా చేశారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. కరోనా వైరస్ సోకిన ఆ యువకుడు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన 21 మంది చికిత్స పొందుతున్నారు. మరి.. వీరికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

మార్చి మూడు న ఫారిన్ నుంచి వచ్చిన ఒక ఐటీ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలటంతో తెలంగాణ రాష్ట్రం ఉలిక్కి పడింది. మందు లేని ఈ వ్యాధిని నయం చేసేందుకు గాంధీ వైద్యులు నడుం బిగించారు. ఈ కేసును సవాలుగా తీసుకొని మందులు ఇవ్వటం షురూ చేశారు. వివిధ దేశాల్లో కరోనా బాధితులకు మలేరియా.. ఎయిడ్స్.. ఎబోలా.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మందుల్ని ఇచ్చి నయం చేసే ప్రయత్నం చేయటం తో.. అదే బాటలో గాంధీ వైద్యులు నడిచే ప్రయత్నం చేశారు.
బాధితుడికి వైద్యం చేసేందుకు తొలుత జనరల్ ఫిజిషియన్.. పల్మనాలజిస్టు.. జనరల్ మెడిసిన్.. సైకాలజిస్టుతో కూడిన ఒక టీం రంగంలోకి దిగింది. బాధితుడి ఆరోగ్య పరిస్థితి మీద ఒక అవగాహనకు వచ్చి.. చికిత్సనుషురూ చేశారు. బాధితుడు ఆసుపత్రిలో చేరే సమయానికి అతనికున్న ఆరోగ్య ఇబ్బందుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. న్యూమోనియా.. జ్వరం.. దగ్గు.. ఒళ్లునొప్పులతో అతగాడు బాధ పడుతున్నట్లుగా గుర్తించి.. వాటిని నియంత్రించే పని ప్రారంభించారు. ఊపిరి తీసుకోవటం కష్టం కావటంతో ఆక్సిజన్ అందిస్తూనే గంట.. గంటకు ఆరోగ్యాన్ని సమీక్షించేవారు.

క్లోరిక్విన్ తోపాటు హెచ్ఐవీ.. ఎబోలా రోగులకు ఇచ్చే లువినవీర్.. రెడిడిసివీర్ ఔషదాల్ని ఇచ్చినట్లుగా వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో బాధితుడు మానసిక ఆందోళనకు గురి కాకుండా ఉండేందుకు సైకాలజిస్టు చేత కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో.. అతనికున్న ఆరోగ్య సమస్యల్లోజ్వరం తగ్గింది. న్యూమోనియా కంట్రోల్ అయ్యింది. ఎనిమిదో రోజుపరీక్షలు జరపగా.. కరోనా వైరస్ లేదని తేలింది. మరో రెండు రోజులకు ఇంకోసారి పరీక్షలు జరిపి.. కరోనా వైరస్ లేదన్న విషయాన్ని గుర్తించాం. అనుకున్నట్లే పద్నాలుగో రోజు పరిపూర్ణ ఆరోగ్యవంతుడ్ని చేసి.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాం. ప్రస్తుతం అతను ఇంట్లోనే హౌస్ క్వారంటైన్ లో ఉన్నాడు. అతనింట్లో వారికి కరోనా లక్షణాలు కనిపించలేదని గాంధీ వైద్యులు చెబుతున్నారు.