Begin typing your search above and press return to search.

విరాట్‌ పై రాజీవ్‌!..మోదీకి బూమ‌రాంగ్ అయ్యిందే!

By:  Tupaki Desk   |   9 May 2019 5:27 PM GMT
విరాట్‌ పై రాజీవ్‌!..మోదీకి బూమ‌రాంగ్ అయ్యిందే!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా బీజేపీ - కాంగ్రెస్ ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. చౌకీదార్ నంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఎద్దేవా చేసి ఇరుక్కుంటే... ఇప్పుడు రాహుల్ నే కాకుండా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజీని డ్యామేజీ చేసేందుకు దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్య‌లు బీజేపీకి దెబ్బ కొట్టేశాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. చౌకీదార్ చోర్ హై అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగ‌గా... రాహుల్ గాంధీ ఏకంగా సుప్రీం కోర్టుకు సారీ చెప్పాల్సి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రాజీవ్ గాంధీపై మోదీ చేసిన జ‌ల్సా వ్యాఖ్య‌ల‌తో బీజేపీకి దెబ్బ ప‌డిపోయింద‌ని చెప్పాలి. రాజీవ్ ప్ర‌ధానిగా ఉండ‌గా... 1987లో ఐఎన్ ఎస్ విరాట్ పై త‌న స‌తీమ‌ణి సోనియా గాంధీ - ఆమె సోద‌రుల‌తో క‌లిసి చేశారంటూ మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానిగా ఉండి దేశ ర‌క్ష‌ణ‌లో కీల‌క భూమిక పోషిస్తున్న విరాట్ నౌక‌ను త‌న జ‌ల్సాల‌కు వినియోగించార‌ని మోదీ ఎద్దేవా చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు నాడు ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఎదురు దాడి మొద‌లెడితే... మ‌రోవైపు భార‌త నావికా ద‌ళంలో నాడు కీల‌క ప‌ద‌వుల్లో ఉండి ఇప్పుడు రిటైర్ అయిపోయిన ప‌లువురు నేవీ మాజీ అధికారులు కూడా మోదీ వ్యాఖ్య‌ల‌పై త‌మ‌దైన శైలి వివ‌ర‌ణ‌లు ఇస్తూ బీజేపీని ఇర‌కాటంలోకి నెట్టేశారు. రాజీవ్ ప్ర‌ధానిగా ఉండ‌గా... ఐఎన్ ఎస్ విరాట్ లో విహ‌రించిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని - అయితే ఈ విష‌యంలో రాజీవ్ అధికార దుర్వినియోగానికి మాత్రం పాల్ప‌డ‌లేద‌ని - త‌న ప‌ర్య‌ట‌న‌లో ప్రొటోకాల్ నిబంధ‌న‌ల‌ను రాజీవ్ ప‌క్కాగానే పాటించార‌ని నేవీ మాజీ ఉద్యోగులు చెబుతున్నారు.

విరాట్ పై నాడు రాజీవ్ విహారం సంద‌ర్భంగా ఆ నౌక‌కు క‌మాండింగ్ ఆఫీస‌ర్‌ గా పనిచేసిన వైస్ అడ్మిర‌ల్ (రిటైర్డ్‌) వినోద్ ప‌శ్రిచా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. నాడు రాజీవ్ గాంధీ త‌న ఫ్యామిలీతో పాటు విరాట్ లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో ఆ నౌక‌కు తానే క‌మాండింగ్ ఆఫీస‌ర్‌ గా ప‌నిచేశాన‌ని - అయితే ఆ ప‌ర్య‌ట‌న‌లో రాజీవ్ త‌న ప్రొటోకాల్ కు ఎంత‌మాత్రం విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాకుండా నాడు రాజీవ్ తో ఆయ‌న స‌తీమ‌ణి సోనియా గాంధీ మాత్ర‌మే ఉన్నార‌ని - మోదీ ఆరోపిస్తున్న‌ట్లుగా నౌక‌లో విదేశీయులు ఎవ‌రూ లేర‌ని కూడా ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. ఈ వాద‌న‌నే చాలా మంది రిటైర్డ్ నేవీ అధికారులు వెల్ల‌డించారు.

అయితే అదే స‌మ‌యంలో నేవీ క‌మాండ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన వీకే జైట్లీ... మోదీ వ్యాఖ్య‌లు నిజ‌మేన‌ని చెప్పేశారు. నాడు రాజీవ్ గాంధీ... త‌న స‌తీమ‌ణితో క‌లిసి బంగారం దీవుల‌కు వెళ్లేందుకు విరాట్ ను వినియోగించార‌ని చెప్పుకొచ్చారు. ఇక ఈ వివాదంపై ఇటు బీజేపీ మోదీ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తూ త‌న‌దైన శైలిలో రెచ్చిపోతే... మోదీ కామెంట్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత‌లు త‌మ‌దైన శైలిలో రివ‌ర్స్ పంచ్ లు సంధించారు. మొత్తంగా గ‌తంలో నేవీలో ప‌నిచేసిన చాలా మంది అధికారులు మోదీ వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌డంతో మోదీ వ్యాఖ్య‌లు బీజేపీకి బూమ‌రాంగ్ అయ్యాయ‌నే వాద‌నే వినిపిస్తోంది.