Begin typing your search above and press return to search.

గాంధీ కుటుంబం సినిమా అయిపోయినట్లేనా..?

By:  Tupaki Desk   |   20 Feb 2017 6:15 AM GMT
గాంధీ కుటుంబం సినిమా అయిపోయినట్లేనా..?
X
స్వతంత్ర భారత రాజకీయాల నుంచి ఇప్పటివరకు ఇండియన్ పొలిటికల్ తెరపై ప్రధాన పాత్ర పోషించిన ఫ్యామిలీ అది. ఇప్పుడు ఆ వంశ రాజకీయాలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత యూపీ ఎన్నికల్లో వారి పరిస్థితి చూస్తుంటే ఆ సినిమా ఇక అయిపోయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.

భారత రాజకీయాల్లో నెహ్రూ-గాంధీ కుటుంబం లీడ్ రోల్ పోషిస్తూ వస్తోంది. దేశానికి వారి వల్ల మంచీచెడూ రెండూ జరిగాయి. తొలినాళ్లలో నెహ్రూ పాలనా దక్షత దేశ రాజకీయాల్లో వారి స్థానాన్ని సుస్థిరం చేయగా.. ఆ తరువాత ఇందిర - రాజీవ్‌ లు కూడా ప్రధానులుగా తమదైన ముద్ర వేసుకోవడంతో పాటు హత్యకు గురవడంతో దేశం కోసం ప్రాణత్యాగం చేసినవారిగా గుర్తింపు పొందారు. ఆ దెబ్బకు నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వానికి ఇక తిరుగే లేకుండా పోయింది. రాజీవ్ మరణం తర్వాత సోనియాగాంధీ దేశ పాలన పగ్గాలు చేపట్టకపోయినా అంతా తానే అయి నడిపిస్తూ ప్రధానులు తన చెప్పుచేతల్లో ఉంచుకుని దీర్ఘకాలం కాంగ్రెస్‌ ను అధికారంలో కొనసాగించగలిగారు.

అయితే.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కానీ ఇప్పుడామె అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కుమారుడికి ఆది నుంచి ప్రజలు - పార్టీ మద్దతు ఇస్తున్నా కూడా నాయకత్వాన్ని చేపట్టేందుకు సంశయిస్తూనే ఉన్నారు. దీంతో దేశం - కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ పై విశ్వాసం కోల్పోయాయి. పైగా ఆయన బ్రహ్మచారి. సో.. రాహుల్ వైపు నుంచి ఆ వారసత్వం కొనసాగించే ఛాన్సులు పోయాయి.

ఇక సోనియా కుమార్తె ప్రియాంకాగాంధీ పార్టీ కార్యకర్తలకు ఇంతకాలం ఆశాకిరణంలా కనిపించారు. ప్రియాంక అచ్చంగా ఇందిరలా ఉంటుందని.. ఆమెను చూస్తే జనం విరగబడి ఓట్లేస్తారని ఇంతకాలం భ్రమలు పడ్డారు. భవిష్యత్‌ లో ఆమె పార్టీకి పునర్‌ వైభవం సాధిస్తారని.. ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తారని అంతా ఆశించారు. ఆమె ప్రచారంతో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకొస్తోంది.. ఇదే ఊపుతో కేంద్రంలోనూ వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్న ధీమా వ్యక్తమైంది. కానీ యుపి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పెద్దగా పాల్గోలేదు. ఇక నెహ్రూ వంశం నుంచి మరో నాయకుడెవరూ లేరు. ఈ తరుణంలో పార్టీపై ఇక ఈ కుటుంబపెత్తనం సాగే అవకాశాలు కనుమరుగౌతున్నాయి. ప్రియాంకను గత పదిహేనేళ్ళుగా పార్టీ ఆహ్వానిస్తూనే ఉంది. కానీ ఆమె పార్టీ కంటే కూడా కుటుంబ బాధ్యతలకే మొగ్గుచూపుతున్నారు. దీంతో భారమంతా ఒంటెద్దు రాహుల్ గాంధీపైనే పడాలి.. కానీ, రాహుల్ ఫెయిల్యూర్సు అన్నీఇన్నీ కావు. దీంతో గాంధీ-నెహ్రూ వారసత్వానికి కొద్దికాలంలోనే ముగింపు తప్పదని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/