Begin typing your search above and press return to search.

‘గాంధీ’ ఫ్యామిలీ అయితే సారీ చెప్పరా?

By:  Tupaki Desk   |   21 July 2016 1:40 PM GMT
‘గాంధీ’ ఫ్యామిలీ అయితే సారీ చెప్పరా?
X
గొప్పలు చెప్పుకోవటం తప్పేం కాదు. కానీ.. అలా చెప్పుకునే క్రమంలో ఎదుటి వారి మనోభావాలు దెబ్బ తినకూడదు. కానీ.. తాను విధేయుడైన గాంధీ ఫ్యామిలీని తప్ప మరెవరినీ పట్టించుకోని కాంగ్రెస్ సీనియర్ నేత డిగ్గీ రాజా తాజాగా ఒక ‘బలుపు’ మాటను మాట్లాడారు. ఆయన మాటల్ని విన్న వారెవరికైనా ఒళ్లు మండిపోయేలా ఉండటం గమనార్హం.

మహాత్మాగాంధీ హత్యకు ఆర్ ఎస్ ఎస్ కు సంబంధం ఉందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే.ఈ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఈ కేసులో రాహుల్ సారీ చెప్పాలని.. లేని పక్షంలో ఈ కేసును కొనసాగించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. దీనిపై రాహుల్ స్పందన బయటకు రాకున్నా.. ఆ కుటుంబానికి వీర విధేయుడైన డిగ్గీ రాజా తాజాగా స్పందించారు.

సారీలు చెప్పటం గాంధీ ఫ్యామిలీ హిస్టరీలోనే లేదంటూ వ్యాఖ్యానించిన ఆయన.. తాము ఈ విషయంలో విచారణకే సిద్ధమన్నారు. గాంధీ ఫ్యామిలీ ఇప్పటివరకూ ఎప్పుడూ క్షమాపణలు కోరలేదని.. ఇప్పుడు కూడా కోరదన్నారు. డిగ్గీ వ్యాఖ్యలతో ఈ కేసును సుప్రీం కొనసాగిస్తున్నట్లేనని చెప్పక తప్పదు. ఆత్మవిశ్వాసం మంచిదే. కానీ.. గాంధీ కుటుంబం ఏదో ఆకాశంలో నుంచి ఊడిపడినట్లుగా డిగ్గీ మాట్లాడటమే అభ్యంతరమంతా. ఆర్ ఎస్ ఎస్ పై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు.. ఈ ఉదంతంలో రాహుల్ కు చుక్కెదురు తప్పదన్న సంకేతాన్ని చెప్పకనే చెప్పేసిన పరిస్థితి. అయినప్పటికీ ఇంత మొండిగా.. బలుపుగా గాంధీ ఫ్యామిలీ గొప్పతనాన్ని కీర్తించటం చూస్తే.. భారత్ లో గాంధీఫ్యామిలీ అప్రకటిత రాజకుటుంబంగా డిగ్గీ అండ్ కో ఫీలవుతున్నారా ఏంటి..?