Begin typing your search above and press return to search.

గాంధీ కుటుంబం : పవర్ లేకుండా 33 ఏళ్ళు.. .టైమ్ పవర్ మరి

By:  Tupaki Desk   |   24 Aug 2022 12:30 AM GMT
గాంధీ కుటుంబం : పవర్ లేకుండా 33 ఏళ్ళు.. .టైమ్ పవర్ మరి
X
ఈ దేశాన్ని ఎక్కువ కాలం ఎవరు పాలించారు అంటే జవాబు ఠక్కున ఎవరైనా చెప్పేస్తారు. నెహ్రూ గాంధీ ఫ్యామిలీయే ఈ దేశాన్ని అత్యధిక కాలం రూల్ చేసింది అని కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఈ దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. నాటి నుంచి 1964 మే 27 వరకూ అంటే పదిహేడేళ్ల పాటు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశాన్ని ఏకధాటిగా పాలించారు. ఆయన తరువాత కేవలం రెండేళ్ల స్వల్ప గ్యాప్ మినహాయించి 1966న ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ఈ దేశానికి ప్రధాని అయిపోయారు. ఆమె 1977 దాకా నిరాటంకంగా ప్రధాని కుర్చీలో కూర్చుని పాలించారు.

మరో వైపు చూస్తే 1977లో ఫస్ట్ టైమ్ కాంగ్రెసేతర ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన జనతా సర్కార్ సొంత విభేదాల వల్ల మూడేళ్ళకే కూలిపోయింది. అలా 1980లో మళ్ళీ ఇందిర దేశానికి ప్రధాని అయ్యారు. మొత్తంగా చూస్తే ఆమె 16 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పాలించారు. ఆమె దారుణ హత్య తరువాత 1984లో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆ మీదట వచ్చిన ఎన్నికల్లో ఆయన తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అలా రాజీవ్ గాంధీ అయిదేళ్ల పాటు పీఎం గా అధికారాన్ని చలాయించిన మీదట 1989లో కాంగ్రెస్ మరోసారి ఓడిపోయింది.

ఈ విధంగా లెక్క తీస్తే కేవలం నెహ్రూ గాంధీ కుటుంబమే 38 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పాలించింది. ఇక 1989 తరువాత గాంధీ కుటుంబేతరులు, కాంగ్రేసేతరులే వరసగా ప్రధానులు అయ్యారు. వీపీ సింగ్, చంద్రశేఖర్ నేషనల్ ఫ్రంట్ తరఫున దేశానికి ప్రధానులు కాగా పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ తరఫున ప్రధానులుగా అయ్యారు. మధ్యలో యునైటెడ్ ఫ్రంట్ తరఫున దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ప్రధానులు అయినా మిగిలిన పద్నాలుగేళ్ళు బీజేపీ తరఫున అటల్ బిహారీ వాజ్ పేయి, నరేంద్ర మోడీ ప్రధానులుగా ఉన్నారు.

ఈ నేపధ్యంలో మూడు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా గాంధీ కుటుంబం మాత్రం ప్రధాని పదవి చేపట్టలేదు. రాజీవ్ మరణం తరువాత సోనియా గాంధీ కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమె 1998లో తిరిగి యాక్టివ్ అయినా 2004 నుంచి 2014 మధ్యలో పదేళ్ల పాటు యూపీయే దేశాన్ని ఏలినా సోనియా కానీ రాహుల్ కానీ కనీసం కేంద్ర మంత్రి పదవులు కూడా తీసుకోలేదు.

దీన్ని బట్టి చూస్తే ఇదంతా కాల మహిమ అనే అంతా అంటున్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెల‌లో జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో గాంధీ కుటుంబమే పీఠం ఎక్కాలన్న డిమాండ్ బాగా పెరుతోంది. దీని మీద కాంగ్రెస్ పెద్దలు అనేక మంది రాహుల్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించకపోతే సీనియర్ల తో సహా అంతా ఇబ్బందులు పడతారని, ఆయన మనసు మార్చుకోవాలని కోరారు.

అధికారానికి గాంధీ కుటుంబం దూరమై 33 ఏళ్ళు గడిచాయని, ఇంకా వారి మీద రాజకీయ ప్రత్యర్ధులు ఆడిపోసుకోవడం దారుణం అని కాంగ్రెస్ వారు అంటున్నారు. ఇపుడు పార్టీ పదవులకు కూడా రాహుల్ కారణంగా ఆఫ్యామిలీ దూరంగా ఉంటే దేశ రాజకీయ చరిత్రలో గాంధీ కుటుంబం మరింత ఇబ్బంది పడుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది మరి.