Begin typing your search above and press return to search.

ఆ 45 నిమిషాల ఆటే కొంపముంచింది.. విరాట్ కోహ్లీ

By:  Tupaki Desk   |   10 July 2019 10:29 PM IST
ఆ 45 నిమిషాల ఆటే కొంపముంచింది.. విరాట్ కోహ్లీ
X
లీగ్ దశలో అద్భుతంగా ఆడి.. ఇంగ్లండ్‌ తో తప్ప ఇంకే జట్టు చేతిలోనూ ఓటమి ఎదుర్కోని భారత జట్టు సెమీఫైనల్‌ లో చతికిలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సెమీఫైనల్‌ లో న్యూజీలాండ్ చేతిలో ఓటమి పాలైంది. న్యూజీలాండ్ ఇచ్చిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటై ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.

తన కెప్టెన్సీలో భారత్‌కు మరో ప్రపంచకప్ అందించాలని తపించిన విరాట్ కోహ్లీకి ఈ ఓటమి మింగుడుపడలేదు. సెమీఫైనల్‌ లో భారత్ ఆటతీరుపై కోహ్లీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. తమ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కీలక వికెట్లను చేజార్చుకోవడం ఓటమిపై ప్రభావం చూపిందని వ్యాఖ్యానించాడు. కేవలం 45 నిమిషాల ఆట తమ తలరాతను మార్చేసిందన్నాడు. 240 పరుగులన్నది ఛేదించలేని లక్ష్యమేమీ కాదని.. అయినా.. ఓడిపోవడం బాధించిందని కోహ్లీ అన్నాడు. మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లి.. మొత్తంగా చూస్తే తొలి అర్థ భాగం తమ వైపే ఉందని - కాకపోతే సెకాండాఫ్‌ లో కివీస్‌ బౌలర్లు రైట్‌ లెంగ్త్‌ బౌలింగ్‌ తో ఆకట్టుకోవడంతో తాము ఆదిలోనే ప్రధాన వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడ్డామన్నాడు.

‘‘మంగళవారం మ్యాచ్ మా చేతుల్లో ఉంది.. బుధవారం మ్యాచ్ మళ్లీ మొదలైన తరువాత కూడా న్యూజిలాండ్‌ ను భారీ పరుగులు చేయకుండా కట్టడి చేశాం. న్యూజిలాండ్ ఇచ్చిన టార్గెట్ ఏమీ ఎక్కువ కాదు. అయినా.. మ్యాచ్ ఓడిపోయాం. చేజేతులా చేసుకున్నాం. ఈ వరల్డ్‌ కప్‌ లో బాగా ఆడాం. కానీ.. నాకౌట్‌ సమరంలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయాం. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ యూనిట్‌ మాపై మొదట్నుంచీ ఒత్తిడి తెచ్చి సక్సెస్‌ అయ్యింది.ఈ మ్యాచ్‌ లో విజయం క్రెడిట్‌ అంతా కివీ బౌలర్లదే. మేము టోర్నీ అంతా ఆకట్టుకున్నా కేవలం 45 నిమిషాల పాటు చెత్తగా ఆడటం వల్లే నిష్ర్కమించాం’’ అని కోహ్లీ తెగ బాధపడ్డాడు.