Begin typing your search above and press return to search.

అమ్మ‌.. గాలీ!! బీజేపీకి నువ్వు 'బీ' టీమా?

By:  Tupaki Desk   |   29 Dec 2022 4:13 AM GMT
అమ్మ‌.. గాలీ!! బీజేపీకి నువ్వు బీ టీమా?
X
క‌ర్ణాట‌క రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి ఇటీవ‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను కొత్త‌పార్టీ పెడుతున్నాన‌ని.. బీజేపీ త‌న‌కు టికెట్ ఇవ్వ‌నందుకే తాను.. పార్టీ పెట్టాల‌ని నిర్ణ‌యించాన‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో 'క‌ళ్యాణ రాజ్య‌ప్ర‌గ‌తి ప‌క్ష‌' పార్టీని ఏర్పాటు చేశారు. అంటే.. క‌ర్ణాటక‌లోని క‌ళ్యాణ క‌ర్ణాట‌క అనే ప్రాంతంలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్క‌డ పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది.

ఇది.. బీజేపీకి న‌ష్ట‌మ‌ని.. గాలి దెబ్బ‌తో బీజేపీ అధికారం కోల్పోవ‌డం ఖాయ‌మ‌ని పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. అయితే.. గాలి వ్యూహం.. ఆయ‌న అడుగులు ఒకింత లోతుగా ప‌రిశీలిస్తే.. ఆయ‌న వ‌ల్ల బీజేపీకి న‌ష్టం క‌ల‌గ‌క పోగా.. మ‌రోసారి పార్టీ అధికారంలోకి వ‌చ్చేలాగా గాలి బీజేపీకి బీ టీంగా మారి.. కొత్త పార్టీ పెట్టార‌నే చ‌ర్చ‌.. క‌న్న‌డ నాట‌.. కోడై కూస్తోంది.

బీజేపీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న మైనింగ్ కింగ్‌ గాలి జనార్ధన రెడ్డి గతంలో ఆపరేషన్ కమలం నిర్వహించి పార్టీని అధికారంలోకి తేవడానికి సహాయపడ్డారు. అంతేకాదు.. పార్టీకి వీర విధేయుడు కూడా. హిందూత్వ అజెండాను భుజాల‌మీద వీపు కూడా మోసే అత్యంత వీర సైనికుడు.

అలాంటి నాయ‌కుడు కేవ‌లం టికెట్ ఇవ్వ‌లేద‌నే కార‌ణంగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీని ఏర్పాటు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఎందుకంటే.. ప్ర‌స్తుతం గాలిపై సీబీఐ కేసులు న‌డుస్తూనే ఉన్నాయి. అంతేకాదు.. ఈ కేసులు ఇప్ప‌ట్లో తేలేలా కూడా లేవు. విచార‌ణ‌లు సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో త‌న‌కు అంతో ఇంతో స‌హ‌క‌రించే ఏకైక పార్టీ బీజేపీ. దీనిని ఇంత కీల‌క స‌మ‌యంలో వ‌దిలేయ‌డం కానీ, దానిని దెబ్బ‌కొట్ట‌డం కానీ, ఉండ‌ద‌ని అంటున్నారు.

మ‌రి ఆయ‌న పార్టీ ఎందుకు పెట్టారంటే.. బీజేపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు.. అటు జేడీఎస్‌కు కానీ, ఇటు.. కాంగ్రెస్‌కు కానీ.. ప‌డ‌కుండా చూసుకోవ‌డ‌మే ఆయ‌న ల‌క్ష్యం. ఇదంతా కూడా బీజేపీ పెద్ద‌ల వ్యూహంలో భాగంగానే జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంటే.. గాలి రాజ‌కీయం.. మొత్తం బీజేపీకే సొంత‌మ‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.