Begin typing your search above and press return to search.

ఇది బాబు మార్కు రాజ‌కీయమా?

By:  Tupaki Desk   |   14 Aug 2015 9:34 AM GMT
ఇది బాబు మార్కు రాజ‌కీయమా?
X
ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఒక‌వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా ఆకాంక్ష‌లు పెరుగుతుండ‌టం, మ‌రోవైపు ఏపీలోని టీడీపీ, బీజేపీయేత‌ర పార్టీల‌న్నీ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడును ల‌క్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్న నేప‌థ్యంలో బాబు కొత్త ఆలోచ‌న చేశార‌ని అంటున్నారు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేశాయి.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని తేల్చిచెప్పిన జైట్లీ...ఆ స్థాయికి స‌రిప‌డా ఆర్థిక స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే లోక్‌ స‌భ‌లో కేంద్ర‌మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్య‌ల వేడి కొన‌సాగుతుంటే...ఆర్థిక‌మంత్రి హోదాలో జైట్లీ చేసిన వ్యాఖ్య‌లు ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రింత ఇబ్బందిని క‌లిగించాయి. అయితే దీనిపై బాబు త‌న‌దైన శైలిలో వాయిస్ వినిపించార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు భావిస్తున్నాయి.

జైట్లీ వ్యాఖ్య‌ల‌పై గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన అభిప్రాయాన్ని ఫేస్ బుక్ లో వెల్లడించారు. ఏపీకి కేంద్రం చేయాలనుకుంటున్న సాయం చాలా తక్కువగా ఉందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా పై చాలా ఆశలు ఉన్నాయని జ‌య‌దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల మంజూరు విషయంలో కేంద్రం మరింత ఉదారంగా వ్యవహరించాలని జయదేవ్ అభిప్రాయపడ్డారు.

అయితే జ‌య‌దేవ్ పోస్టుల వెన‌క చంద్రబాబు సూచనలు ఉన్నాయ‌ని భావిస్తున్నారు. బాబు ఆదేశాల‌తోనే గల్లా జయదేవ్ ఫేస్ బుక్ లో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వచ్చీ రాని ఇంగ్లీష్ భాషలో ఓ ఇంగ్లీష్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ పై బాబు గ‌తంలోనే సీరియస్ అయ్యారని వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇంగ్లిష్‌ లో జ‌రిగే, కేంద్రం దృష్టికి వెళ్లాల్సిన అంశాల‌పై జ‌య‌దేశ్ మాట్లాడతార‌ని వార్త‌లు కూడా వెలువ‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో బాబు సూచనమేరకే గల్లా జయదేవ్ చాలా స్పష్టంగా ఫేస్ బుక్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.