Begin typing your search above and press return to search.

పార్లమెంటులో మహేశ్ బాబు బావ ‘దూకుడు’

By:  Tupaki Desk   |   17 April 2016 7:46 AM GMT
పార్లమెంటులో మహేశ్ బాబు బావ ‘దూకుడు’
X
ప్రిన్సు మహేశ్ బాబు సినిమా ఇండిస్ట్రీలో ‘దూకుడు’ చూపిస్తుండగా ఆయన బావ గల్లా జయదేవ్ చట్టసభ సభ్యుడిగా ‘దూకుడు’ చూపిస్తున్నారు. పార్లమెంటుకు ఎంపికవడం తొలిసారే అయినా సీనియర్ లీడర్లను మించిపోయేలా ఆయన అన్నిట్లో యాక్టివ్ గా ఉంటున్నారు. పార్లమెంటులో జరిగే చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.

పీఆరెస్ ఇండియా సర్వే ప్రకారం ఏపీ నుంచి లోక్ సభకు ఎంపికైన 25 మంది ఎంపీల్లో ముగ్గురు మాత్రం గత రెండేళ్లలో ఇంతవరకు నోరు విప్ప లేదట. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. ఇకపోతే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇంతకుముందు టెర్ములో రాష్ర్ట విభజన సమయంలో పార్లమెంటులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేవారు. ఈసారి మాత్రం ఆయన ఇంతవరకు పెదవి విప్పలేదట. మిగతావారంతా మాత్రం మాట్లాడారని సర్వేలో తేలింది.

కాగా మహేశ్ బాబు బావ, గుంటూరు ఎంపీ అయిన గల్లా జయదేవ్ ఈ విషయంలో అందరికంటే ముందున్నారట. ఆయన ఇంతవరకు పార్లమెంటులో 55 చర్చల్లో పాల్గొని టాప్ లో నిలిచారు. ఆయన పార్లమెంటుకు డుమ్మా కొట్టడం కూడా తక్కువే. 86 శాతం అటెండెన్స్ ఉందాయనకు. ఇక ఆ తరువాత స్థానంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడు ఉన్నారు. మూడో స్థానంలో తోట నరసింహం ఉన్నారు. రామ్మోహన్ 53 చర్చల్లో పాల్గొనగా తోట 41 చర్చల్లో పాల్గొన్నారు. వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి - కొత్తపల్లి గీతలు 40 చర్చల్లో పాల్గొని నాలుగో స్థానంలో ఉన్నారు. మరో వైసీపీ ఎంపీ వరప్రసాద్ 38 చర్చల్లో పాల్గొని అయిదో స్థానంలో ఉన్నారు.

ఇక ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నల విషయంలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత టాప్ లో నిలిచారు. ఆమె ఇంతవరకు 354 ప్రశ్నలు అడిగారు. గల్లా జయదేవ్ 234 ప్రశ్నలతో రెండో స్థానంలో... రామ్మోహన్ నాయుడు 217 ప్రశ్నలతో మూడో స్థానంలో ఉన్నారు. కాగా చర్చల్లో పాల్గొననని ఎస్పీవై రెడ్డి కనీసం ఈ రెండేళ్లో ఒక్క ప్రశ్న కూడా అడగకపోవడం విచిత్రం.