Begin typing your search above and press return to search.

మోదుగుల వెళ్లిపోయిన‌ట్లేన‌ట‌!

By:  Tupaki Desk   |   4 March 2019 9:18 AM GMT
మోదుగుల వెళ్లిపోయిన‌ట్లేన‌ట‌!
X
గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే.. టీడీపీ సీనియ‌ర్ నేత మోదుగుల వేణుగోపాల‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడిపోయారా? అంటే.. అవున‌ని చెబుతున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని గుంటూరుఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ వెల్ల‌డించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా గుంటూరులో నిర్వ‌హించిన ఒక స‌మావేశంలో గ‌ల్లా హాజ‌ర‌య్యారు. గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ను ఆశిస్తున్న టీడీపీ ఆశావాహుల‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా గ‌ల్లా నోటి నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఈ మీటింగ్ కు హాజ‌రైన నేత‌లు ప‌లువురు.. మోదుగుల వైఖ‌రితో పార్టీకి విప‌రీత‌మైన న‌ష్టం వాటిల్లింద‌ని.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ సీనియ‌ర్ల‌ను వ‌దిలేసి.. వ్య‌క్తిగ‌తంగా అనుబంధం ఉన్న వారికి పార్టీ నామినేట్ ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్న‌ట్లుగా ఆరోపించారు.

దీనిపై స్పందించిన ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే కావ‌టంతో ఆయ‌నేం చేసినా చూడాల్సి వ‌చ్చింద‌ని.. ఇక‌పై అలాంటి ప‌రిస్థితి ఉండ‌ద‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల గుంటూరు పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష‌కు మోదుగుల రాలేద‌ని.. దీంతో ఆయ‌న పార్టీ నుంచి వెళ్లిపోనున్న‌ట్లుగా క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లుగా గ‌ల్లా చెప్పారు.

రానున్న ఎన్నిక‌ల్లో గుంటూరు వెస్ట్ సీటును.. అంద‌రిని క‌లుపుకుపోయే అభ్య‌ర్థినే పార్టీ ఎంపిక చేస్తుంద‌ని చెప్పిన గ‌ల్లా తీరుపై టీడీపీ నేత‌లు కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారా? లేదా? అన్న విష‌యాన్ని గ‌ల్లా ప్ర‌స్తావించ‌కుండా ఉంటే బాగుండేద‌ని.. అధినేత చెప్పాల్సిన మాట‌ను గ‌ల్లా చెప్ప‌టం ఏమిట‌ని త‌ప్పు ప‌డుతున్నారు.