Begin typing your search above and press return to search.

సుగర్ ఫ్యాక్టరీపై కన్నేసిన టీడీపీ ఎంపీ?

By:  Tupaki Desk   |   16 July 2016 11:00 AM GMT
సుగర్ ఫ్యాక్టరీపై కన్నేసిన టీడీపీ ఎంపీ?
X
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో మూతపడిన గాజులమండ్యం సహకార చక్కెర ఫ్యాక్టరీ ఆస్తులపై మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుటుంబం కన్నుపడిందని స్థానిక నేతలు అనుకుంటున్నారు. కారుచౌకగా కొనుగోలు చేసేందుకు ఆమె పైరవీలు ప్రారంభించారని.. తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలో ఇండిస్టియల్‌ కారిడార్‌ రానున్నట్లు ముందస్తు సమాచారంతో ఈ ఫ్యాక్టరీ ఆస్తులను చేజిక్కించుకోవడానికి ఆమె కుమారుడు - గుంటూరు ఎంపి జయదేవ్‌ గల్లా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు.

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో గాజులమడ్యం చక్కెర ఫ్యాక్టరీ ఉంది. మరోవైపు సెల్‌ కంపెనీలు - ఐఐటి విద్యాసంస్థలు ఉండటంతో ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఫ్యాక్టరీకి సంబంధించి 162 ఎకరాల భూములతోపాటు భవనాలు - యంత్ర సామాగ్రి విలువ దాదాపు రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గత మూడు సీజన్లుగా ఫ్యాక్టరీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 2015-16 సీజన్‌ లో ఫ్యాక్టరీకి లాకౌట్‌ ప్రకటించారు. చెరకు తోలిన రైతులకు రూ.13 కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఫ్యాక్టరీ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత ఈ ఫ్యాక్టరీని సొంతం చేసుకోవ డానికి స్థానిక మయూర షుగర్స్‌ యజమాని పోటీ పడ్డారు. అయితే గల్లా కుటుంబం రంగ ప్రవేశం చేయడంతో ఆయన వెనక్కు తగ్గాడు. తాజాగా ఆమె తన కుమారుడు ఎంపి జయదేవ్‌ గల్లా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని వినిపిస్తోంది. ఫ్యాక్టరీ పరిధిలోని తనకు అనుకూలమైన రైతుల సహకారంతో ఎలాగైనా ఫ్యాక్టరీ ఆస్తులను కొనుగోలు చేయాలని పట్టుదలతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫ్యాక్టరీ ఆస్తులను విక్రయించే ప్రసక్తే లేదని మరో వర్గానికి చెందిన రైతులు తేల్చి చెబుతున్నారు. ఫ్యాక్టరీని పున:ప్రారంభించాలని ఈ రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది.

కాగా సహకార రంగంలోని గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీని అమ్మకానికి పెడితే ఉద్యమం తప్పదని వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని ఆదు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమ పార్టీ నేతలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో దీన్ని గల్లా చేజిక్కించుకోగలరో లేదో చూడాలి.