Begin typing your search above and press return to search.

ముద్దుకృష్ణమనాయుడి స్కెచ్ తేడా కొడుతోంది..

By:  Tupaki Desk   |   16 Dec 2016 5:52 AM GMT
ముద్దుకృష్ణమనాయుడి స్కెచ్ తేడా కొడుతోంది..
X
టీడీపీ సీనియర్ లీడర్ గాలి ముద్దుకృష్ణమనాయుడికి రాజకీయంగా కొత్త కష్టం మొదలవుతోంది. సొంత ఇంట్లోనే ముసలం పుట్టి వారసత్వం కోసం కొట్లాట మొదలైంది. దీంతో ఈ సమస్య ఎలా పరిష్కరించాలా అని ఆయన తల పట్టుకుంటున్నారట.

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ నేత రోజా చేతిలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడికి ఆ తరువాత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ పదవీకాలం 2020 వరకు ఉంది. దీంతో 2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన మానుకున్నారు. ఆ స్థానాన్ని తన పెద్ద కుమారుడికి ఇవ్వాలనుకున్నారు. 2014లో ఎన్నికల్లో ఓటమి ఇలా కలిసిరావడంతో తన రాజకీయ వారసత్వానికి వేగంగా తెరపై తేవడానికి స్కెచ్ గీశారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు వద్ద కూడా ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. కానీ... గాలి ఒకటి తలస్తే ఆయన రెండో కుమారుడు ఇంకోటి తలచాడు. నగరి అసెంబ్లీ సీటుకు నేనే పోటీ చేస్తానంటూ రెడీ అవుతున్నాడు. దీంతో ఇద్దరు కొడుకుల మధ్య యుద్ధం మొదలైంది.

నిజానికి తన పెద్ద కుమారుడు భాను ప్రకాశ్‌ పోటీ చేస్తారని కార్యకర్తలకు గాలి ముద్దుకృష్ణమ చెబుతూ వస్తున్నారు. భానుప్రకాశ్‌ కూడా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇంతలో ముద్దుకృష్ణమ రెండో కుమారుడు గాలి జగదీష్ తెరపైకి వచ్చారు. కొంతకాలంగా ఆయన కూడా ఊరూరు తిరుగుతున్నారు. తొలుత ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు లైట్‌ తీసుకున్నాయి. అయితే ఇప్పుడు జగదీష్‌ కూడా వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి తాను పోటీ చేస్తానని చెబుతుండడంతో గాలి ఇంట రచ్చ రేగింది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తేనే టీడీపీ ఈజీగా గెలుస్తుందని జగదీష్‌ తన వాదన వినిపిస్తున్నారు.

మరోవైపు ఇదే అదనుగా జెడ్పీ చైర్‌ పర్సన్ గీర్వాణి వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి రోజాపై తాను పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడికి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనదేనని కార్యకర్తలకు చెబుతున్నారు. నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దీంతో ఇద్దరు కొడుకులు ఇలా కొట్టుకుంటే మధ్యలో గీర్వాణి టిక్కెటు ఎగరేసుకు పోతారేమోనని గాలి భయపడుతున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/