Begin typing your search above and press return to search.

ఫోన్లు ట్యాప్ చేయ‌డం లేదంటున్న టీడీపీ

By:  Tupaki Desk   |   29 Oct 2016 3:26 PM GMT
ఫోన్లు ట్యాప్ చేయ‌డం లేదంటున్న టీడీపీ
X
వైసీపీ నేతల ఫోన్లను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ట్యాపింగ్ చేస్తోంద‌ని ఆ పార్టీ నేత‌ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. అధికార టీడీపీ త‌ర‌ఫున ఆ పార్టీ ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమ నాయుడు వివ‌ర‌ణ ఇస్తూ...ప్ర‌తిప‌క్షల నేత‌ల ఫోన్ ట్యాప్ ఆరోప‌ణ‌లు హాస్యాస్పదమ‌ని ఎద్దేవా చేశారు. ఎర్రచందనం - మైనింగ్ - ఇసుక - లిక్కర్ - మట్టి మాఫియా డాన్లతో జతకట్టిన చరిత్ర వైసీపీ నాయకులదని గాలి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా గ‌తంలో ఫోన్ ట్యాపింగ్‌ కు మ‌ద్ద‌తిచ్చార‌ని వివ‌రించారు.

కాంగ్రెస్ - వైసీసీ పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడుపై బురద చల్లి రాష్ట్రాభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. టీఆర్ ఎస్‌ తో కలిసి రాష్ట్ర విభజనకు కుట్ర చేసిన పార్టీలే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు - అధికారులు - మీడియా ప్రతినిధులు - సొంత పార్టీ చెందిన నేతలకు చెందిన ఫోన్లను చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ నేరం అంటున్న దే వైసీపీ నేత‌లు గ‌తంలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లను ట్యాపింగ్ చేస్తే మాత్రం తెలంగాణ ప్ర‌భుత్వానికే సపోర్ట్ చేశారని గాలి ముద్దుకృష్ణ‌మ మండిప‌డ్డారు. ఇప్పుడు త‌మ‌ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలున్నాయని మాట్లాడుతున్న వారు ఆధారాలు ఉంటే కోర్టులో దావా వేయాలని గాలి స‌వాల్ విసిరారు. కల్తీసారా - అక్ర‌మ‌ మైనింగ్ - ఎర్రచందనం - ఇసుక మాఫియాల డాన్లతో జతకట్టి వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటి చేసిన ఘనత వైసీపీ నేతలదని గాలి ముద్దుకృష్ణమ అన్నారు. కల్తీ మద్యం తాగి పలువురు చనిపోగా దానిపై సీబీఐ విచార‌ణ జ‌రిపితే వారు వైసీపీ నేత‌లు కాకాని గోవర్ధన్ రెడ్డి - ప్రతాప్ కుమార్ రెడ్డిలు నిందితులుగా తేలింద‌న్నారు.మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వైసీపీ నేతలతో కలిసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని గాలి ముద్దుకృష్ణ‌మ విమర్శించారు. పట్టిసీమను వ్యతిరేకించిన‌ట్లే...ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు నీరు అందించేందుకు గోదావరి నది మీద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపడితే దానిని వ్యతిరేకిస్తున్నారని మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/